Read more!

తెలుగు దేశంకు మద్దతుగా రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశంలో నయా జోష్ కనిపిస్తోంది. అన్నీ మాంచి శకునములే అన్నట్లుగా ఆ పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర అశేష ప్రజాదరణతో 50 రోజులుగా సాగుతోంది.

అడుగడుగునా జననీరాజనంతో ఆయన పాదయాత్ర సాగుతున్న తరుణంలోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంపూర్ణ విజయం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్ధాయిలో దక్కిన విజయం పార్టీలో సహజంగానే ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసింది. నారా లోకేష్ పాదయాత్రలో శనివారం (మార్చి 25) నారా వారి కుటుంబానికి చెందిన హీరో నారా రోహిత్ పాల్గొన్నారు.

సోదరుడితో అడుగు కలిపి నడిచారు. ఆ సందర్భంగా రోహిత్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలూ తెలుగుదేశంకే మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు. వైసీపీ వరుస పరాజయాలతో డిఫెన్స్ లో పడిన తరుణంలో రోహిత్ మరో బాంబు పేల్చారు. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగనున్నారని వెల్లడించారు.  వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పట్లో ఆయన ప్రచారానికి బ్రహ్మాండమైన ప్రజా మద్దతు లభించింది. పాతికేళ్ల వయస్సులోనే ఆయన ప్రచారం ఎంతో పరిణితితో ఉందని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపించారు. 2009 తరువాత జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా రాజకీయాలలో క్రియాశీలంగా  లేరు. పూర్తిగా సినీ కెరీర్ మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పీక్స్ లో ఉంది.

పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆస్కార్ సాధించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన హీరోగా నటించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలలో క్రియాశీలంగా పాల్గొంటారా అన్న అనుమానాలు వ్యక్తం ఔతున్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆయన తెలుగుదేశంకు మద్దతుగా వచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

 నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున   జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంకు మద్దతుగా రంగంలోకి దిగుతారని నటుడు తారకరత్న చెప్పిన సంగతిని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అలాగే పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగుతారనీ, సమయం వచ్చినప్పుడు ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెప్పారు. ఇప్పుడు తాజాగా నారా రోహిత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చెప్పడంతో ఆయన పార్టీకి మద్దతుగా రంగంలోకి దిగే సమయం దగ్గరకు వచ్చేసిందనే తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.