175 కాదు.. 30, 35 స్థానాల్లో గెలిస్తే గొప్పే.. రఘురామకృష్ణం రాజు
posted on Aug 10, 2022 7:39AM
రచ్చబండలో రఘురామ కృష్ణం రాజు తన సొంత పార్టీ వైసీపీని మరో సారి ఉతికి ఆరేశారు. ఢిల్లీలో చంద్రబాబు, మోడీ భేటీ విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించడాన్ని సెటైర్లతో కడిగి పరేశారు. వైసీపీలో ఏం చేసినా నాలుగుగోడల మధ్యేనని..పార్టీతో కలవడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. మంగళవారం (ఆగస్టు9)న రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ మరో సారి సొంత పార్టీ అధినేత జగన్ పైనా, పార్టీ తీరుపైనా విమర్శల వర్షం కురిపించారు. సెటైర్లతో చెడుగుడు ఆడేశారు. ఢిల్లీలో చంద్రబాబుతో మోడీ కొద్ది సేపు ముచ్చటించడంపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడాన్ని తప్పు పట్టారు. ఔను వాళ్లిద్దూరూ మాట్లాడుకున్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో ముఖ్యమంత్రిగా పని చేశారని, ఎన్డీఏ లో చంద్రబాబు నాయుడు కీలక నేతగా వ్యవహరించారని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య కొంతకాలం గ్యాప్ వచ్చిందని, మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారని, దాన్ని కూడా తప్పు పట్టడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రధానితో ఐదు నిమిషాలు బేటి అయితే, తమ ముఖ్యమంత్రి గంట సేపు పాటు కలిసి డిన్నర్ చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ప్రధాని, ఇతరులతో కలిసి డిన్నరే చేయలేదని గుర్తు చేశారు. అయినా ప్రధాని గంటసేపు మధ్యాహ్న భోజనం చేశారని చెప్పడమే వింతగా ఉందని రఘురామ రాజు అన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోటీ చేసినా, తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అసలు వైసీపీతో కలిసే వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మనం (వైసీపీ) ఇలాగే నాలుగు గోడల మధ్య చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే అంటూ సెటైర్లు వేశారు. బిజెపి, జనసేన ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్నాయని, వారితో టీడీపీ జత కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రఘురామ కృష్ణం రాజు అన్నారు. తాను ఎప్పటినుంచో ఈ విషయాన్నిచెబుతున్నానీ, అయినా 175కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు, వాళ్లు కలిస్తే జగన్ కు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వైసీపీ 30 నుంచి 35 స్థానాలలో గెలిస్తే గొప్పేనన్నారు.
తెలంగాణలో గెలుపు కోసమే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దీటుగా పోరాటం చేస్తున్న టిడిపితో బిజెపి జతకట్టే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. 9వ తేదీ వచ్చినప్పటికీ 60 శాతం మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. ట్రెజరీకి వచ్చిన ఆదాయాన్ని తొలుత ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు వెచ్చించాలన్న ఆయన, ఆ సొమ్మును సంక్షేమ కార్యక్రమాల అమలుకు మళ్లించడం సరికాదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం అన్నది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఆ తర్వాతే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. కానీ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి పెట్టుకున్న అధికారులకు, కీలక బాధ్యతలను అప్పగించి, నిధులను దారి మళ్ళిస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
రాష్ట్రంలో విప్పి చూపెడితే తప్పు లేదు కానీ, తప్పును ప్రశ్నిస్తే మాత్రం చితకబాదుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లాలో మాధవ రెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో ఎక్కువసేపు నిలబడలేక అసహనంతో నిరసన వ్యక్తం చేయగా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనిని గొడ్డును బాదినట్టు బాదిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. మాధవ రెడ్డిని చితకబాదినది గోరంట్ల మాధవ్ కాగా, ఆయన పై అప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేయగా అతన్ని వీఆర్ లో ఉంచారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని గొడ్డును బాదినట్లు, బాదినందుకు మాధవ్ కు అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారనీ, ఇప్పుడు విప్పి చూపించినందుకు కూడా ప్రమోషన్ ఇస్తారేమోనని ఎగతాళి చేశారు.
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో మార్ఫింగ్ చేశారనే విషయం ఎలా తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.. కేసు నమోదు చేసి విచారణ చేపడితేనే కదా వీడియో మార్ఫింగ్ చేశారా?, లేదా?? అన్న విషయం తెలిసేదని నిలదీశారు.. నగ్న వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేశారని తన మిత్రుడు, సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తుంటే, సకల శాఖామంత్రి అది మాధవ్ వీడియోని నిర్ధారించారన్నారు. సకల శాఖామంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ, నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం ఆయన మైండ్ సెట్ ను, పార్టీ మైండ్ సెట్ ను తెలియజేస్తుందన్నారు. నాలుగు గోడలో లోపల జరిగిన వ్యవహారం, ఇద్దరి మధ్యలోనే ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండి ఉండేది కాదన్నారు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు చూసి, 8 కోట్ల కళ్ళు గాయపడిన తర్వాత, నాలుగు గోడల మధ్యలో జరిగిన వ్యవహారం అంటూ పేర్కొనడం ఎమిటని ప్రశ్నించారు.