భగవద్గీత మత గ్రంథం కాదు.. సువేందు అధికారి
posted on Aug 10, 2022 6:57AM
పార్టీ మారితే భాషా మారుతుంది. గతంలో విమర్శించిన వారినే పార్టీ మారిన తరువాత పొగడాల్సి ఉంటుంది. రాజకీయాలలో అది సహజం. అయితే గతంలో వల్లెవేసిన సిద్ధాంతాలు సైతం మారిపోయే పరిస్థితి సువేందు అధికారికి ఎదురైంది. తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన తరువాత ఆ గూటి పలుకులే పలకడంలో ఆశ్చర్యం ఉండదు. ఇఫ్పుడు ఆయన చేస్తున్నది అదే..
బెంగాల్ లో అధికారంలోకి వస్తే పాఠశాలల్లో భగవద్గీత బోధిస్తామని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. భగవద్గీత ఎంత మాత్రం మతగ్రథం కాదని ఆయన అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ లో జరిగిన ఒక రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన గుజరాత్ లో కూడా పాఠశాలల్లో భగవద్గీత బోధన పాఠ్యాంశాల్లో భాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజాశీర్వాదంతో బెంగాల్ లో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.
అప్పుడు తప్పకుండా పాఠశాల సిలబస్ లో భగవద్గీతను చేరుస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. తొలి నుంచీ తృణమూల్ లో ఉన్న సువేందు అధికారి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ గూటికి చేరారు.
ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ పైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఆయన మళ్లీ తృణమూల్ గూటికి చేరుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. కానీ ఎన్నికలకు ముందు తృణమూల్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న పలువురు టీఎంసీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరిన సంగతి విదితమే.