నాలుగు రోజుల్లో మలి విడత వారాహియాత్ర షెడ్యూల్
posted on Jul 3, 2023 @ 10:56PM
ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉండగా జనసేన కూడా ప్రతిపక్ష పాత్రని పోషిస్తుంది. వారాహియాత్రలో భాగంగా ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సభలకు జనం అంచనాలకి మించి రావడం వైసీపీకి మింగుడుపడటం లేదు. దీంతో వైసీపీ టిడీపీని పక్కనపెట్టి జనసేనపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. జగన్ వ్యక్తిగతంగా చేస్తోన్న విమర్శలకి ధీటుగా జనసేన స్పందిస్తోంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఎవరికీ సురక్షితం కాదంటు జనసేన పార్టీ రాజకీయవ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తాజాగా విడుదల చేసిన మూడు పేజీల బహిరంగలేఖలో నిప్పులు చెరిగారు. సమస్యలని జగన్ననకి చెబుదామనుకున్నా వినేవారు కనిపించడం లేదని పాలకుల్లో స్పందించే గుణం లేనప్పుడు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా ఫలితం ఉండబోదని నాదెండ్ల ఈ సందర్భంగా ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏ వర్గం సురక్షితంగా లేదని అర్హత ఉన్న లబ్దిదారులకి పధకాలు అందకపోవడం దాన్ని ప్రభుత్వమే అంగీకరించడం సిగ్గుచేటని మనోహర్ దుయ్యబట్టారు. వారాహి యాత్రకి ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంటే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని తిరిగి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలకి దిగుతున్నారని మనోహర్ ఈ లేఖలో ఆరోపించారు. పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాల గురించి ఆయా శాఖల మంత్రులు వివరణ ఇవ్వలేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతుందని లేఖలో ఆరోపించారు. కాగా నాలుగు రోజుల్లో మలివిడత వారాహి యాత్ర షెడ్యూల్ ని ప్రకటిస్తామన్న మనోహర్ వారాహి విజయ యాత్ర మొదటి దశ అద్భుతంగా నిర్వహించామన్నారు.
మత్య్సకారుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధ్యయనం చేశారని జనవాణి కార్యక్రమంలో ఎక్కువగా ఫించన్లు.. రహదారుల సమస్యలు వచ్చాయని రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తారని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసిన రాష్ట్రాన్ని .. రాష్ట్రంలో జనసేన తిరిగి వెలుగులు నింపి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేయనుందని మనోహర్ ఈ లేఖలో ప్రకటించారు.
వారాహి విజయ యాత్ర రెండో విడత పశ్చిమగోదావరి జిల్లాలోనే ప్రారంభించనున్నట్లు స్థానిక నాయ కులతో సంప్రదించి నాలుగైదు రోజులలోపే తదుపరి షెడ్యూల్ ప్రకటిస్తామని జనసేన ఈ లేఖలో పేర్కొంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా కలిసి ముందుకు చక్కటి వేదిక ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ ఏ అడుగు వేసినా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వేస్తారని మనోహర్ ఈ లేఖలో వివరించారు.