మాన్ ను విమానం నుంచి దింపేశారా? దిగిపోయారా?
posted on Sep 20, 2022 7:51AM
పంజాబ్ ముఖ్యమంత్రికి జర్మనీలో ఘోర పరాభవం జరిగిందన్న వార్తలు దేశంలో సంచలనం సృష్టించాయి. తప్పతాగి విమానం ఎక్కారనీ అందుకే దించేశారని బీజేపీ విమర్శల దాడి చేస్తోంది. ఆప్ మాత్రం అనారోగ్యం కారణంగా ఆయన విమానం నుంచి దిగిపోయారని చెబుతోంది. కారణమేదైనా ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి వ్యవహారం ఇటు మీడియాలోనూ.. అటు సామాజిక మాధ్యమంలోనూ విపరీతంగా వైరల్ అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ1గా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా బుక్కవ్వడం.. అదే లిక్కర్ తాగి విమానం ఎక్కినందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ను జర్మనీలో విమానం నుంచి దించేయడం కాకతాళీయమే అయినా అవినీతిని ఊడ్చి పారేస్తాం అంటూ చెప్పే ఆప్ ఇలా మద్యం విషయంలో వార్తల్లో నిలవడం మాత్రం యాధృచ్చికం కాదంటున్నారు పరిశీలకులు.
గాంధీ అంతే వాసి అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆప్ ఇప్పుడు ఇలా మద్యం వ్యవహారంలోనే ఆరోపణలు ఎదుర్కొనడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ విషయానికి వస్తే ఆయన వారం రోజుల పర్యటన కోసం జర్మనీ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన సెప్టెంబర్ 11 నుంచి 18 ఆయన జర్మనీ పర్యటన షెడ్యూల్. షెడ్యూల్ ప్రకారమే ఆయన సెప్టెంబర్ 11న జర్మనీ బయలుదేరి వెళ్లారు. అలాగే షెడ్యూల్ ప్రకారమే 18వ తేదీన (ఆదివారం) తిరుగు ప్రయాణమయ్యారు. జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానాశ్రయం నుంచి లుప్టాన్సా ఎయిర్ లైన్స్ విమానంలో ఆయన ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది.
అయితే ఆయన ఆ విమానంలో బోర్డ్ చేసిన తరువాత దిగిపోయారు. ఆ విమానం దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా అక్కడ నుంచి బయలు దేరింది. ఢిల్లీ చేరుకున్న ఆ విమానంలో మాన్ లేరు. తొలుత విమానం ఆలస్యానికి సాంకేతిక లోపం కారణమని ఎయిర్ లైన్స్ ప్రకటించింది. అయితే ఆ విమానంలో బోర్డ్ చేసిన తరువాత మాన్ దిగిపోవడానికి కారణమేమిటో వెల్లడించలేదు. అలాగే తరువాత విమానం ఆలస్యానికి సాంకేతిక లోపం కారణం కాదనీ, ఒక ప్రయాణీకుడిని అతడి లగేజీని విమానం నుంచి దించి వేయాల్సిరావడం వల్లే ఆలస్యమైందని తరువాత ప్రకటించింది.
ఆ ప్రయాణీకుడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మానేనని అంటున్నారు. ఆయనను విమానం నుంచి దించివేయడానికి కారణం ఆయన తప్పతాగి ఉండటమేనని చెబుతున్నారు. అయితే ఆప్ మాత్రం మాన్ అనారోగ్యం కారణంగానే విమానం నుంచి దిగిపోయారని అంటున్నది. లేని విషయాన్ని బీజేపీ అనవసరంగా పెద్దది చేసి రాద్ధాంతం చేస్తోందని, గుజరాత్ ఎన్నికలలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్న కారణంగానే ఆ పార్టీ ఇటువంటి అవాస్తవ ప్రచారం చేస్తోందని విమర్శిస్తున్నది.