టైం మీరు చెబుతారా.. నన్ను చెప్పమంటారా?.. షర్మిల
posted on Sep 20, 2022 7:46AM
ఏదో సినిమాలో బాలకృష్ణ డైలాగ్ ఉంది ప్లేస్ నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా, టైమ్ నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా అంటూ సరిగ్గా అదే స్టైల్ లో వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల టీఆర్ఎస్ పై పంచ్ డైలాగులు సంధించారు. తన విమర్శలపై టీఆర్ఎస్ కేసులు పెడతామనీ, అసెంబ్లీకి పిలిపిస్తామనీ స్పందించిన తీరుపై ఆమె పవర్ ఫుల్ డైలాగులతో రిటార్డ్ ఇచ్చారు. ‘ప్లేస్ మీరు చెప్పేశారు..టైమ్ నన్ను చెప్పమంటారా.. మీరు చెబుతారా?’ అంటూ నిలదీశారు. దమ్ముంటే అసెంబ్లీకి పిలవండని సవాల్ చేశారు. నడుచుకుంటూ వస్తా.. కాలి నడకన వస్తా, తలెత్తుకు వస్తా అంటూ షర్మిల ఓ రేంజ్ లో డైలాగులతో అదరగొట్టేశారు.
సుదీర్ఘ పాదయాత్ర చేసినా తెలంగాణలో తనకు కానీ తన పార్టీకి కానీ ఎలాంటి గుర్తింపూ రాకపోవడం, ఎవరికీ పట్టనట్టుగా యాత్ర సాగడంతో ఆమె తన విమర్శలలో ఘాటు పెంచారు. అరెస్టు, కేసుల వరకూ వెళితే తప్ప ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని గ్రహించారు. విడతల వారీ పాదయాత్ర వల్ల వైఎస్సార్ టీపీకి ఇప్పటి వరకూ ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోవడంతో ఆమె తన రూటు మార్చారు. ఓ వైపు పాదయాత్ర కొనసాగిస్తూనే.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై విమర్శల దాడిని తీవ్రం చేశారు. పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు.
మరో వైపు టీఆర్ఎస్ కూడా షర్మిల విమర్శలను స్వాగతిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమెపై కేసులు పెట్టీ, ప్రతి విమర్శలతో మరింత రెచ్చగొట్టేలా టీఆర్ఎస్ నేతలు వ్యవహరించడానికి కారణమిదేనని అంటున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందన్న అంచనాతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేని పార్టీకి ఏదో ఓ మేర గుర్తింపు వస్తేనే సాధ్యమౌతుందన్న అభిప్రాయంతో ఇంత కాలం పట్టించుకోకుండా వదిలేసిన షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లేలా, ఆమెపై విమర్శలు సెటైర్లతో రెచ్చగొట్టే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని పేర్కొంటున్నారు.
అందుకే ఆమెపై గవర్నర్ కు ఫిర్యాదు చేసి అసెంబ్లీకి పిలిపించడం ద్వారా ప్రజల దృష్టిని ఈడీ దాడులు, లిక్కర్ స్కాం వంటి అంశాల నుంచి మళ్లించి పొలిటికల్ హీట్ పెంచాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సాగుతోంది. ఇదంతా పరస్పర అవగాహనతోనే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇంత కాలం షర్మిల పార్టీని కానీ, పాదయాత్రను కానీ ఇసుమంతైనా పట్టించుకోని టీఆర్ఎస్ ఇప్పుడు.. రాష్ట్రంలో లిక్కర్ స్కాం, బీజేపీ నేతల వరుస పర్యటనలతో పోలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో.. షర్మిలపై విమర్శలు కేసులు అంటూ హడావుడి చేయడం వెనుక వ్యూహం ఇదేనని అంటున్నారు.