అసెంబ్లీలోనే తిండి, నిద్ర.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన...
posted on Sep 13, 2016 @ 5:29PM
అసెంబ్లీల్లో నిరసనలు తెలియజేయాలంటే ప్లకార్డులు పట్టుకొనో.. లేకపోతే తమకు తోచిన నినాదాలు చేస్తూ ఆందోళనలు చేస్తుంటారు. లేకపోతే దీక్షలు చేస్తూ నిరసనలు చేస్తుంటారు. కానీ పంజాబ్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం కాస్తం రొటీన్ కు భిన్నంగా నిరసన తెలుపుతున్నారు. అసలు సంగతేంటంటే.. అకాలీదళ్-బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే ఈ తీర్మానం వీగిపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కూడా కాంగ్రెస్ నేతలు ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై మళ్లీ కొత్తగా చర్చ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ అసెంబ్లీ హాల్ ను ఖాళీ చేసి వెళ్లాలని కోరినా ఎమ్మేల్యేలు వినకుండా అక్కడే నిరసనను కొనసాగించారు. అసెంబ్లీ హాల్ లో నేలపైనే పడుకున్నారు. ఈరోజు ఉదయం అక్కడే బ్రష్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చరణ్ జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ, అసెంబ్లీ అధికారులు మొత్తం లైట్లు, ఏసీలు ఆపేశారని, తమకు చాలా సేపటి వరకు కనీసం తిండి, నీళ్లు కూడా లేవని చెప్పారు. పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ కేఎఫ్ సీ నుంచి ఆహారం పంపారని చెప్పారు. ఈ నిరసనలో మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.