మృతుల కుటుంబాలకు సిద్ద రామయ్య నష్టపరిహారం..
posted on Sep 13, 2016 @ 4:58PM
కావేరి జలాల వివాదం వల్ల తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటకలో అయితే పరిస్థితి మరింత హింసాత్మకంగా తయారైంది. సుప్రీంకోర్టు కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అల్లర్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కర్ఫ్యూ కూడా విధించారు. ప్రజలు బయటకి రావద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు సీఎం సిద్ద రామయ్య పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారమిస్తామని ఆయన ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కావేరి జలాల విషయంలో సుదీర్ఘకాలంగా తమకు అన్యాయం జరుగుతోందని.. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామని, ఈ ఆదేశాల ప్రకారం 6 రోజుల పాటు తమిళనాడుకు నీటిని విడుదల చేశామన్నారు. నీటి విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు కష్టంగా ఉన్నా, ఆదేశాలు పాటించాల్సిందేనన్నారు. ప్రజలెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.