పులస తినే భాగ్యం ఇక ఉండదా?.. కాలుష్యం కాటుకు పులస మాయం
posted on Aug 2, 2023 @ 12:45PM
వింటే భారతం వినాలి... తింటే గారెలు తినాలి అన్నది సామెత.. కానీ మాంసాహార ప్రియులు మాత్రం మరీ ముఖ్యంగా సీఫుడ్ ను ఇష్టపడేవారు మాత్రం పులస చేప తినాలి అని అంటారు. సీజనల్ గా మాత్రమే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే లభించే పులస చేపకు ఎక్కడ లేని డిమాండ్ ఉంటుంది. ఒక్కో సారి ఆ చేప వేల రూపాయలు దాటి లక్షల్లో కూడా పలుకుతూ ఉంటుంది. ఇది కేవలం జూలై, ఆగస్టు నెలలలో మాత్రమే లభిస్తుంది.
పుస్తెలమ్మైనా సరే ఒక సారైనా పులస చేప పులుసు తినాలి అన్న నానుడి గోదావరి జిల్లాల్లో ఎక్కువగా వినిపిస్తుంటుంది. కేవలం గోదావరి వరదల సమయంలో మాత్రమే లభించే ఈ పులస చేప అంటే మాంసాహార ప్రియులలో ఉండే క్రేజే వేరు. రుచి, డిమాండ్ సంగతిని పక్కకు పెడితే.. ఎదురీది మరీ గోదావరిలోకి ప్రవేశించే ఏకైక చేప పులస. సముద్రం గోదావరి కలిసే సంగమం వద్ద గోదావరికి వరద సమయంలో సముద్రంలో నుంచి ఏటికి ఎదురీది ఉప్పునీటి నుంచి మంచినీటిలోకి ప్రవేశించే ఈ పులస చేపలు గోదవరి వరద తగ్గిన తరువాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. అయితే ఇటీవలి కాలంలో పులస చేప లభ్యత గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే పులస కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు, మాంసాహార ప్రియులూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వచ్చే వరదల్లో ఎదురీది మరీ గోదవరిలోకి ప్రవేశించే విలస చేప పులస చేపగా మారి రుచికరమైన ఆహారంగా మారుతుంది.
ఏటా వరదలు వస్తున్నా పులస చేప లభ్యత ఎందుకు తగ్గిపోతోందీ అంటే పర్యావరణ వేత్తలు కాలుష్యమే కారణమని అంటున్నారు. మరీ ముఖ్యంగా సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేటలు వేయడం...గోదావరి బేసిన్ లో చమురు, సహజవాయువుల కోసం అన్వేషణలు కారణమని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోదావరిలోకి యథేచ్ఛగా పరిశ్రమల వ్యర్థాలను వదిలివేయడం వల్ల గోదావరి జలాలు కలుషితం కావడం కూడా విలసలు సంతానోత్పత్తి కోసం గోదావరికి ఎదురీది రావడం తగ్గిపోతోందని చెబుతున్నారు. గోదావరి జలాలు కలుషితం అవ్వడం వల్ల ఇప్పటికే రకాల చేపలు కనుమరుగైపోయాయి. ఇప్పుడు పులస చేప కూడా వేగంగా ఆ కోవలోకే చేరిపోతున్నదని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా చేపడుతున్న రొయ్యల సాగు కూడా పులస చేపలు అంతరించిపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు. రొయ్యల సాగు కోసం వాడే మేత, యాంటీబయటిక్ వ్యర్థాలను గొదావరిలోకి మళ్లించడం వల్ల పులసలు అంతరించిపో తున్నాయనీ, వాటి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నదనీ నిపుణులు చెబుతున్నారు.