తెలుగుదేశం... జనసేన మధ్యలో బీజేపీ.. పొత్తులు పొడిచేనా?
posted on Aug 2, 2023 @ 10:51AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు, పొత్తులు, ఎత్తుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా పొత్తు వ్యవహారాలన్నీ బీజేపీ సెంట్రిక్ గానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ సర్వ వ్యవస్థలనూ గుప్పెట్లో పెట్టుకుని ఒక విధంగా పోలీసు పాలనను సాగిస్తున్నదని రాజకీయ వర్గాలలోనే కాదు జనబాహుల్యంలో కూడా గట్టిగా వినిపిస్తున్నది. జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా తెలుగుదేశం జగన్ సర్కార్ విధానాలు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది.
2024 ఎన్నికలలో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలు, ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. పార్టీని, పార్టీ శ్రేణులను నిరంతరం చైతన్యవంతం చేస్తూ జగన్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలలో ప్రచారం చేస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు లోకేష్ యువగళం పాదయాత్ర పేరిట జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, నేతల అరాచకత్వాలను ప్రజలలో ఎండగడుతూ యువగళం పేర పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కార్ ను గద్దెదింపడమే లక్ష్యంగా పోరుబాటలో సాగుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ను మరోసారి అధికారంలోకి రానివ్వనని, అందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ రాష్ట్రంలో పొత్తు పొడుపులపై చర్చకు తెరతీశారు. అది కూడా నిన్నో మొన్నో కాదు.. దాదాపు ఏడాదిన్నర కిందటే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననీ, జగన్ వ్యతిరేక శక్తులన్నిటినీ కలుపుకు పోతానని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందాలనుకోవడం లేదని కూడా క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో తెలుగుదేశం, జనసేనలు పొత్తుతోనే ఎన్నికలకు వెడతాయన్నది విస్పష్టంగా తేలిపోయింది. అయితే రాష్ట్రంలో ఇసుమంతైనా ఓటు బ్యాంకు లేకపోయినా.. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి నడిస్తే మంచిదని, జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమని జనసేనాని భావిస్తున్నారు.
ఇప్పటికే జనసేన, బీజేపీల మధ్య అధికారికంగా మైత్రి ఉంది. తెలుగుదేశం కూడా బీజేపీతో ఘర్షణాత్మక వైఖరిని కోరుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్రంలో జగన్ హింసాత్మక వైఖరి, ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల నమోదు వంటి విషయాలలో కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా నిలబడి, నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అండ అవసరమన్న భావనతోనే తెలుగుదేశం బీజేపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జ ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలరాదు అని పదేపదే చెబుతున్న పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ కలిసివస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఏపీలో రాజకీయ వాతావరణం చూస్తుంటే ఒకే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసే ఎన్నికల బరిలోకి దిగుతాయన్న భావన, బీజేపీ జగన్ సర్కార్ కు అండగా నిలుస్తూ పొత్తు పొడుపునకు అవరోధాలు కలిగిస్తోందన్న భావనా కలుగుతున్నాయి.