ఎన్నికల ముందు బిఆర్ఎస్ వరాలు
posted on Aug 2, 2023 @ 1:52PM
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు వరాలను ప్రకటిస్తున్నారు. వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ వర్గానికి దగ్గరైంది. ప్రజల్లో తమ ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకుంటుంది బిఆర్ఎస్ ప్రభుత్వం. కాగా.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. ఆర్టీసీ సిబ్బంది దీర్ఘకాలికంగా చేస్తున్న పలు డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. 69,100 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను 300 కి.మీల మేర విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.బీసీ కుల వృత్తులు చేసే వారికి లక్ష రూపాయల రుణం ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.వరంగల్ జిల్లాలోని మామ్‌నూర్ విమానాశ్రయాన్ని టెర్మినల్ భవనం, ప్రస్తుత రన్‌వే పొడిగింపు కోసం 253 ఎకరాల అదనపు భూమిని సేకరించి అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ ఏడాది జూన్‌లో విమానాశ్రయ విస్తరణ కోసం అదనపు భూమిని సేకరించేందుకు సర్వే పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ విలీనం, హైదరాబాద్ మెట్రో, వరంగల్ ఎయిర్ పోర్టు అంటూ చేసిన ప్రకటనలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చాయి. వీటిపై విస్తృత చర్చ జరుగుతుంది.. ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకతను మర్చిపోయే స్థాయికి వచ్చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రకటనలతో హ్యట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే కేసీఆర్ నిర్ణయాలపై సోషల్ మీడియాలో మరో రకంగా ప్రచారం జరుగుతుంది. ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్ అన్న మాటలు వైరల్ అయ్యాయి. ఈ భూమండలం ఉన్నంత వరకూ ఆర్టీసీ విలీనం జరగదని గతంలో తేల్చి చెప్పారు. 50కిపైగా కార్పొరేషన్లు ఉన్నాయని వాటన్నింటినీ ప్రభుత్వంలో కలపమని డిమాండ్లు వస్తాయన్నారు. అందుకే అప్పట్లో సాధ్యం కాదని తేల్చారు. కెసీఆర్ ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు ఎవరూ అడగకపోయినా ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన ప్రకటనలను సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఎన్నికల స్టంట్ అని పలువురు అనుకుంటున్నారు. నాలుగు వందల కిలోమీటర్ల మెట్రోను మూడు నుంచి ఐదేళ్లలో పూర్తి చేస్తామనడం పూర్తి జిమ్మిక్కేనని నమ్ముతున్నారు. అందుకే.. కేబినెట్ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ శ్రేణులు నిర్ణయించాయి. కేబినెట్ నిర్ణయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని… పార్టీ నేతల్ని కెటీఆర్ ఇప్పటికే ఆదేశించారు. కానీ ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్తున్నా కానీ నెగెటివ్ కోణంలో ప్రచారం జరుగుతోంది.