కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం
posted on Feb 22, 2021 @ 11:47AM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. శాసనసభలో తన మెజారిటీ నిరూపించుకోవడంలో సీఎం నారాయణస్వామి విఫలమయ్యారు. మేజిక్ ఫిగర్ లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెళ్లిపోయారు. ఎల్జీ తమిళసైని కలిసి తన రాజీనామా అందజేశారు నారాయణ స్వామి.
బలపరీక్ష కోసం పుదుచ్చేరి శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై ఓటింగ్ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలుందు ప్రకటించారు.
పుదుచ్చేరి శాసనసభలో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిసి మొత్తం 33 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల తర్వాత ప్రస్తుతం 26 మంది ఉన్నారు. నారాయణస్వామి ప్రభుత్వం గట్టెక్కాలంటే 14 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ అధికార కాంగ్రెస్ కూటమి బలం 12కి తగ్గింది. ఇందులో కాంగ్రెస్ నుంచి స్పీకర్ తో కలిపి 10, డీఎంకే నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు విపక్ష పార్టీ అయిన ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి బలం 14గా ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో పుదుచ్చేరి రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా కిరణ్‌బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పించి.. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తమిళసై.. నారాయణస్వామి ప్రభుత్వం సోమవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించింది.