అప్పుడు శంకరమ్మ.. ఇప్పుడు వాణిదేవి!
posted on Feb 22, 2021 @ 11:18AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. కొంత కాలంగా వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలతో కుదేలైన అధికార పార్టీని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువగా ఓటర్లు ఉండే ఈ స్థానాల్లో గెలవడం టీఆర్ఎస్ కు కత్తి మీద సామే. అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారంటే.. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు.
నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెనుకంజ వేసినా.. టీఆర్ఎస్ పెద్దలు ఇతరత్రా ఏవోవే హామీలు ఇచ్చి పోటీకి ఆయనను ఒప్పించారంటున్నారు. హైదరాబాద్- మహబూబ్ నగర్- రంగారెడ్డి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను పోటీ చేయాలని కోరినా.. ఆయన తిరస్కరించారని తెలుస్తోంది. దీంతో హైదరాబాద్ ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం భావించినట్లు ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పోటీ చేయకుండా... వామపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సపోర్ట్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే నామినేషన్ల గడువు ముగియడానికి రెండు రోజుల ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ స్థానం నుంచి రంగంలోకి దిగాలని నిర్ణయించారు.
టీఆర్‌ఎస్ పట్టభద్రుల అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని కటించారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓడిపోతామనే భయంతో పోటీ చేసేందుకు నేతలు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉన్న స్థానంలో... పీవీ కూతురును పోటీ చేయిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పీవీ కుటుంబాన్ని బలి పశువు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన హైకోర్టు లాయర్ దంపతుల హత్య దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించింది. పట్టపగలు నడిరోడ్డుపై లాయర్లను అతి కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గురైన వామనరావు దంపతులు బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆ వర్గమంతా అధికార పార్టీపై ఆగ్రహంగా ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బ్రహ్మణ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ సమయంలో వాణిదేవిని ఎమ్మెల్సీ బరిలోకి దింపారు కేసీఆర్. దీని ద్వారా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ఆ వర్గ ప్రజలను కూల్ చేయవచ్చని కేసీఆర్ భావించినట్లుగా చెబుతున్నారు. బ్రహ్మణుల్లో సర్కార్ పై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడంతో పాటు బీజేపీ అభ్యర్థికి చెక్ పెట్టేలా గులాబీ బాస్ ఎత్తు వేశారంటున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణిదేవిని దింపాలన్న కేసీఆర్ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి విమర్శలే వస్తున్నాయి. ఖచ్చితంగా ఓడిపోతామని భావించిన సీటులో పీవీ కూతురుని పోటీ చేయిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాల సమయంలో వాణిదేవికి ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీలు ఖాళీ కావడంతో ఆమెను ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కాని కేసీఆర్ మాత్రం తాను ఇచ్చిన మాటన మర్చిపోయి.. ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే పీవీ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అయినా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం తన పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉండటంతో ఆమెను పావుగా వాడుకుంటున్నారని జనాల్లో చర్చ జరుగుతోంది.దివంగత ప్రధాని కూతురిని గవర్నర్ కోటాలోనే లేకపోతే ఎమ్మెల్యే కోటాలోనే నామినేట్ చేయాలని కాని.. ఎన్నికల బరిలో నిలపడం ఏంటనే చర్చ వస్తోంది. అది కూడా ఓడిపోతామని తెలిసిన సీటులో... మహిళను బరిలోకి దింపి రాజకీయం చేయడమేంటనే ప్రశ్న జనాల నుంచి వస్తోంది.
గతంలోనూ తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతా చారీ తల్లి విషయంలోనూ కేసీఆర్ ఇలానే చేశారని ప్రజా సంఘాలు, పీవీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. శంకరమ్మను అసెంబ్లీకి పంపిస్తానని ఉద్యమంలోనే హామీ ఇచ్చిన కేసీఆర్.. 2014 ఎన్నికల్లో మాత్రం ఆమె కోరుకున్న సీటు ఇవ్వకుండా.. మరో ప్రాంతానికి పంపించారు. అది కూడా కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న, బలమైన నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన హుజూర్ నగర్ నుంచి ఆమెను బరిలోకి దింపారు. శంకరమ్మ టికెట్ సమయంలోనే కేసీఆర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓడిపోయే సీటును ఇచ్చి కేసీఆర్ అవమానించారనే ఆరోపణలు ఉద్యమకారుల నుంచి వచ్చాయి. ఇప్పుడు వాణిదేవి విషయంలో అదే జరుగుతుందని చెబుతున్నారు. రాజకీయ లబ్ది కోసం వాణిదేవిని ఎమ్మెల్సీగా పోటీ చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పీవీ కుటుంబాన్ని వాడుకోవడం కేసీఆర్ దిగజారుడు తనానికి నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి.