బీజేపీకి రాజకీయ సమాధి!
posted on Feb 22, 2021 @ 12:33PM
దక్షిణాదిలో పాగా. ఇదీ బీజేపీ ఎజెండా. ఉత్తరాదిలో పాతుకుపోయిన కాషాయం పార్టీ.. ఇక దక్షిణాదిలో దూసుకెళ్లాలని ఉత్సాహంగా ఉంది. తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రోజురోజుకీ అంటరాని పార్టీగా మారిపోతోంది. ఇదంతా ఆ పార్టీ స్వయంక్రుతాపరాధమే అంటున్నారు. 2014లో చంద్రబాబుతో కలిసి అధికారం పంచుకున్నప్పుడు బీజేపీని ఏపీ ప్రజలు నెత్తినపెట్టుకొని చూసుకున్నారు. ప్రత్యేక హోదాపై చిక్కుముడులు వేసినప్పటి నుంచీ ఆ పార్టీని చీదరించుకుంటున్నారు. అప్పుడు మొదలైన బీజేపీ పతనం.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఇప్పుడు పాతాళానికి దిగజారింది ఆ పార్టీ ప్రతిష్ట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క బీజేపీనే. ఏపీకీ ఆ పార్టీ చేసిన, చేస్తున్న అన్యాయం ఇంకెవరూ చేయలేదనే చెబుతున్నారు. ఆనాటి ప్రత్యేక హోదా నుంచి నేటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వరకూ అంతా అన్యాయమే. రాష్ట్రానికి తీరని నష్టమే అంటున్నారు ఏపీ ప్రజలు. ఇంత చేసి తగదునమ్మా అంటూ తిరుపతి ఎంపీ సీటు కోసం తహతహలాడుతోంది. ఏపీకి ఏం చేశారని ఆ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు ఓటర్లు. ఆంధ్రుల ఆక్రోషం ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులే కరువు. పోటీ చేసిన చోట్ల డిపాజిట్లు గల్లంతు.
ఇప్పుడే కాదు.. గత 2019 ఎన్నికల్లోనూ కాషాయ పార్టీకి ఒక్క శాతం కూడా ఓట్లు రాలేదు. గతంలో పువ్వు గుర్తుపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి ఉండేవారు. ఇప్పుడు చట్టసభల్లో ప్రాతినిధ్యమే లేదు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు గత ఎన్నికల్లోనే ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారు ఓటర్లు. ఇప్పుడిక విశాఖ రైల్వే జోన్ ఇవ్వనందుకు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తున్నందుకు.. కమలదళంపై కాక మీదున్నారు ఏపీ ప్రజలు. ప్రత్యేకించి విశాఖ వాసులైతే బీజేపీపై ఓ రేంజ్ లో రగిలిపోతున్నారు. ఒకప్పుడు విశాఖ ఓటర్లు కమలనాథులను విశేషంగా ఆదరించారు. ఇప్పుడు నేతలే పార్టీని వీడిపోతున్నారు. తాజాగా, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు బీజేపీకి రాజీనామా చేశారు. ఏపీలో బీజేపీ ఉనికి కోల్పోయిందన్నారు.
నిజమే ఏపీలో బీజేపీ తనకు తాను రాజకీయ సమాధి చేసుకుంటోంది. కేంద్రం తీరుతో రాష్ట్ర పార్టీ ఇరకాటంలో పడుతోంది. అంతర్వేది రథం దగ్థం తర్వాత రాజకీయంగా కాస్త హడావుడి చేసిన కమలనాథులు.. ఆ తర్వాత వరుసగా జరిగిన ఆలయాలపై దాడులతో పొలిటికల్ యాక్టివిటీ పెంచారు. శ్రీశైలం మీదుగా కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ రథయాత్ర చేయ సంకల్పించారు. అంతలోనే పంచాయతీ ఎన్నికలు రావడం.. ఈ లోగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోవడంతో.. రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. ఈ సమయంలో కమలనాథులు కాలు బయటపెడితే జనాలు ఆ పార్టీపై ఉక్కు పిడికిలి బిగించడం ఖాయం.
అందుకే నష్ట నివారణ కోసం ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి తనవంతు ప్రయత్నం చేయబోగా.. కేంద్ర పెద్దల నుంచి ఆయనకు ఎలాంటి సహాయమూ అందలేదు. విశాఖ ఉక్కు గురించి తనను అడగొద్దంటూ అమిత్ షా ముఖం చాటేశాడు. ప్రధాని మోదీ అయితే వీర్రాజుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. హస్తినలో తెలుగోడికి ఇంతటి అవమానకర పరిస్థితి రావడం ఇదే తొలిసారి కాదు. కేంద్రం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలు, బీజీపీతో వైసీపీ కుమ్మక్కు అయిన తీరు... అన్నిటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఏపీ ప్రజలు. ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సరైన సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు.