Read more!

డా. జయశంకర్ కుటుంబానికి అవమానం!

 

కేసీఆర్ అవమానాల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇంతవరకు ఆ దిశలో ఒక్క అడుగు కూడా వేయలేదు. అలాగే అమరవీరుల కుటుంబ సభ్యులను ఎన్నికలలో నిలబెడతామని వాగ్దానం చేసిన కేసీఆర్ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి అతి బలవంతం మీద, ఆమె ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మీదట టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించాడు. అదికూడా టీఆర్ఎస్ పొరపాటున కూడా గెలవని హుజూర్ నగర్ టిక్కెట్ ఇచ్చాడు. ఈ విషయంలో అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ మీద చాలా ఆగ్రహంగా వున్నాయి. ఇదిలా వుంటే, కేసీఆర్ తాజాగా మరో అవమానం చేశాడు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అయిన జయశంకర్ సార్ కుటుంబ సభ్యుడిని దారుణంగా అవమానించాడు. కేసీఆర్ విషయంలో జయశంకర్ సార్ తన చివరి దశలో నమ్మకాన్ని కోల్పోయారు.

 

ఇప్పుడు జయశంకర్ కుటుంబానికి కూడా ఆ విషయం బాగా తెలిసొచ్చింది. జయశంకర్ సార్ అన్న కొడుకైన వాసుదేవరావు కేసీఆర్ని కలిసి తనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరాలని అనుకున్నారు. దీనికోసం ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్ళారు. అయితే కేసీఆర్ ఇంట్లో వున్నప్పటికీ ఆయనకి లోపలికి వెళ్ళే అవకాశం లభించలేదు. సెక్యూరిటీ గార్డులు వాసుదేవరావుని ఇంటి బయటే నిలబెట్టేసి కేసీఆర్ పార్టీ ఆఫీసుకి వస్తారు అక్కడకి వెళ్ళి వెయిట్ చేయమని చెప్పారు. నేను జయశంకర్ సార్ కుటుంబ సభ్యుడినని చెప్పినా ఎంతమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. చేసేది లేక వాసుదేవరావు టీఆర్ఎస్ భవన్‌కి వెళ్ళి రెండు గంటలకు పైగా కేసీఆర్ కోసం వెయిట్ చేశారు. అయితే కేసీఆర్ అక్కడకి రాలేదు. చివరికి వాసుదేవరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

 

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని పదేపదే చెప్పే కేసీఆర్ ఇప్పుడు జయశంకర్ సార్ కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాసుదేవరావుకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఇంటికి వచ్చిన మనిషిని పలకరించాలన్న సంస్కారం కూడా లేకుండా పోయిందా అని అంటున్నారు. పార్టీ ఆఫీసులో రెండు గంటలకు పైగా వాసుదేవరావును వెయిట్ చేయించడం దారుణమని విమర్శిస్తున్నారు