Read more!

యన్టీఆర్, పవన్, మహేష్ తెదేపా ప్రచారంలో పాల్గొంటారా

 

నందమూరి హరికృష్ణ ఆయన తనయుడు జూ.యన్టీఆర్ గత కొంత కాలంగా తెదేపాకు దూరంగా ఉంటున్నారు. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే. అయితే గత ఎన్నికలలో స్టార్ ఎట్రాక్షన్ గా నిలిచిన యన్టీఆర్ ఈసారి తెదేపా తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు వస్తున్నారా లేదా అనే సంగతి ఇంకా తేలలేదు. అటు తెదేపా నేతలు కానీ, ఇటు యన్టీఆర్ గానీ ఈ విషయంపై ఇంతవరకు బయటపడలేదు. పార్టీ కోరనప్పుడు తానేందుకు చొరవ తీసుకొని భంగపడాలి? అని యన్టీఆర్ భావిస్తుంటే, ఆయన చొరవ చూపకుండా పార్టీకి దూరంగా మసులుతున్నపుడు మనమెందుకు బ్రతిమాలాలి అనే ఆలోచనతో ఉన్నందున, ఈసారి ఎన్నికల ప్రచారంలో యన్టీఆర్ పాల్గొంటారా అని అనుమానంగానే ఉంది. అయితే ఈ ఎన్నికలు తేదేపాకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక తెదేపా తప్పని సరిగా అతని సహాయం కోరే అవకాశం ఉంది. అదేవిధంగా యన్టీఆర్ కూడా సరిగ్గా అదే ఆలోచనతో స్వయంగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

 

ఇక, పవన్ కళ్యాణ్ తేదేపాకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్నపటికీ ఇంతవరకు తాను ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ఎన్నడూ అనలేదు. అందువల్ల ఆయన ప్రచారంలో పాల్గొంటారా లేక ఇదేవిధంగా అప్పుడప్పుడు టీవీలలో కనబడుతూ అన్యాపదేశంగా ఆ పార్టీకే ఓటేయమని ప్రభోదిస్తారా? అనే సంగతి ఇంకా తేలవలసి ఉంది. ఆయన తీరు చూస్తుంటే రెండో పద్దతికే మొగ్గు చూపేలా ఉంది తప్ప నేరుగా ఎన్నికల ప్రచారం చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు కనబడటం లేదు.

 

ఇక మరొక ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇటీవల తెదేపాలో చేరిన తన బావగారు గల్లా జయదేవ్ కోసం తెదేపా తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చును. ఆవిషయం మహేష్ స్వయంగా చెప్పకపోయినా జయదేవ్ పార్టీలో చేరుతున్న రోజే, మహేష్ బాబు తన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించేశారు. ఈ ముగ్గురు సినీ హీరోలు తెదేపా తరపున గట్టిగా ప్రచారం చేసినట్లయితే, తెదేపా తప్పకుండా లబ్ది పొందవచ్చును.