మునుగోడులో మూడు పార్టీల్లో ముందున్నదెవరో?
posted on Oct 3, 2022 @ 2:34PM
మునుగోడు ఉప ఎన్నిక నగారా మోగింది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ఈ నెల 14 వరకూ నామినేషన్ల దాఖలకు గడువు ఉంది. మునుగోడుతో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్,, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్ లో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక, అధికార తెరాస మాత్రమే కాదు, కాంగ్రెస్, బీజేపీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకాగా తీసుకున్నాయి.
ఒక విధంగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ కానుందని, పరిశీలకులు ప్రజలు భావిస్తున్నారు. అలాగే, మునుగోడు ఉప ఎన్నిక అధికార తెరాస ఎనిమిదేళ్ళ పాలనకు రెఫరెండం, అయితే, బీజేపీ తెలంగాణలో కాషాయ జెండా ఎంట్రీకి గేట్’వే (ముఖ ద్వారం)గా భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టికుని సత్తాచాటేందుకు చూస్తోంది. ముఖ్యంగా, సిట్టింగ్ స్థానం, హుజూర్’ నగర్ సహా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఉపన్నికల్లోనూ ఓటమిని ఎదుర్కున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి అయినా, మరో సిట్టింగ్ స్థానం మునుగోడును ఎలాగైనా నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.
బీజేపీలో చేరిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక జరుగతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో రాజగోపాల రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగుతున్నారు. అధికారికంగా, బీజేపే అధిష్టానం ఇంకా ఆయన పేరు ప్రకటించక పోయినా, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు ఇప్పటికే అయన తరపున పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.
మరోవంక, కాంగ్రెస్ పార్టీ పాల్వాయ్ స్రవంతిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ముమ్మరంగా ప్రచ్రాం సాగిస్తోంది. అయితే అధికార తెరాస మాత్రం ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. కానీ, జిల్లా మంత్రి జగీష్ రెడ్డి సారధ్యంలో కేసీఆర్’ బొమ్మతో ప్రచారం సాగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతొ విందులు, వినోదాలతో పెద్ద ఎత్తున ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు నియోజక వర్గంలో ఇంకా ఎంతో కొంత పట్టున్న వామపక్ష పార్టీలు తెరాసకు మద్దతు ప్రకటించాయి. అయితే మునుగోడు, ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపధ్యంలో, ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.