హిమాలయాలను మించిన ఔన్నత్యం లాల్ బహదూర్ శాస్త్రి వ్యక్తిత్వం
posted on Oct 3, 2022 @ 2:21PM
కాలేజీ పిల్లలకి, పెద్ద ఉద్యోగాలకు శిక్షణకు వెళ్లే వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులని చాలా చెబు తుంటారు. కానీ నిస్వార్ధ నాయకుడు, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జీవితంలో కొన్ని అంశాలను తీసుకుని బోధిస్తే విలువలతో కూడిన వ్యక్తిత్తం, హిమాలయాలను మించిన ఔన్నత్యం పిల్లలలో సమకూరుతాయి. లాల్ బహదూర్ శాస్త్రి జీవితానికి మించిన గొప్పతనం ఏ పర్సనాలిటీ డెవలెప్ మెంట్ కోర్సూ బోధించలేదు. దేశాన్ని జైజవాన్..జైకిసాన్ అంటూ ముందుకు నడిపించిన ధీరుడు లాల్‌బహదూర్. భారత్,పాకిస్తాన్ యుద్ధం తర్వాత దేశ ప్రగతికి బాటలు వేసి ముందడుగు వేయించిన రాజకీయవేత్త ఆయన. దేశ రక్షణకు సైనికుడు ఎలాగో దేశ ప్రజ లకు తిండి అందించే రైతూ అంతే సమానుడే అనే ఒక గొప్ప నినాదంతో దేశాన్ని సైనిక, రైతు సంక్షేమ పథంలో నడి పించిన మహానాయకుడాయన.
పాల ఉత్పత్తి పెంచేందుకు దోహదపడిన శ్వేత విప్లవం, వ్యవసాయం అభివృద్ధికి బాటలు వేసిన హరిత విప్లవం లాంటి ఉద్యమాలను ప్రోత్సహించిన తొలితరం రాజకీయ నాయకులలో అతి ముఖ్యులు లాల్ బహదూర్. 1965లో ఎం.ఎస్. స్వామినాథన్ హరిత విప్లవానికి నాంది పలకగా.. ప్రభుత్వ పెద్దగా ఆ ఉద్యమా నికి సహకరించి ఆ మిషన్ విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు.
లాల్‌బహదూర్ శాస్త్రి ఎన్నడూ పదవులు, వాటితో వచ్చే ప్రతిష్ట, పలుకుబడి కోసం పాకులాడలేదు. ప్రధాని గా ఉన్న కాలంలో కూడా చాలా సామాన్యునిలానే జీవించారు. చిత్రమేమంటే అప్పట్లో ఆయనకు కొంత కాలం కారు కూడా లేదు. తర్వాత ఎప్పుడో పిల్లల కోసం ఒక ఫియెట్ కొన్నారు.. అదీ అప్పుచేసి! అంతేకాదు మరో గర్వించ దగ్గ అంశమేమిటంటే, పదవులును అడ్డుపెట్టుకుని ఉన్నతోద్యోగాలు ఇప్పించడం వంటివి ఆయన ఎన్నడూ చేయలేదు. అంతెందుకు ఆయన కుమారుడు హరికృష్ణశాస్త్రికి అతను పనిచేసే అశోక్ లేలాండ్ కంపెనీ లో జనరల్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. లాల్‌బహదూర్ కి భవిష్యత్తు గోచరమై, హరికృష్ణను ఉద్యోగం మానిపించేరు. కారణం ఆ కంపెనీవారు తర్వాత తనను ఏదో ఒక పని గురించి వేధించకుండా ఉంటారని.
ఇప్పటి రాజకీయనాయకుల్లాగా ఆయన పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాలనుకోలేదు. చిత్రమేమంటే, ఆయనకు కనీసం స్వంత ఇల్లే లేదు. ఒకసారి అంటే లాల్‌బహదూర్ ఇంకా ప్రధాని కావడానికి చాలా కాలం ముందు ఆయన స్నేహితుడు ఒకాయన ఆయనకు తెలీకుండా ఇంటి ఏర్పాటు చేయబోయాడు. ప్రజా ప్రతినిధులు ఇలాంటివాటికి ఆశపడకూడదని వారించి అతని ప్రయత్నాన్ని ఆపించాడు. ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మస్తాయి ! భవిష్యత్ తరానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి.