ఝార్ఖండ్ లో రాజకీయ అలజడి
posted on Aug 28, 2022 @ 1:33PM
ఝార్ఖండ్ రాజకీయ ముఖచిత్రం మారనుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ శాసనసభ్యత్వానికే దెబ్బపడే పరిస్థితి ఏర్పడింది. అదే జరిగితే సోరేన్ నాయకత్వంలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీల సంకీర్ణ ప్రభుత్వం నిలబడే అవకాశాలు తక్కువేనని విమర్శ కులు అంటున్నారు. దీన్ని గురించే ఇపుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు ఆరంభమయ్యాయి.
ప్రభుత్వం ఊగిసలాటలో ఉన్న తరుణంలో, సంకీర్ణ కూటమిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హేమంత్ సోరేన్ సీఎంగా ఉంటూ గనుల లీజును తనకు తానే కేటాయించుకోవడమే వివాదా స్పదమైన సంగతి తెలిసిందే. సోరేన్ శాసన సభ్యత్వంపై అనర్హత వేటు వేసేందుకు ఈసీఐ పచ్చజెండా ఊపినట్లు రాజ్‌భవన్ వర్గా లు అనధికారికంగా ప్రకటించాయి. దీంతో.. గవర్నర్ ఏ క్షణాన్నైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే సీఎం హేమంత్ సోరేన్ నష్టనివారణ చర్యలను ప్రారంభించారు.
శుక్రవారం నుంచి తమ వర్గం ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన మూడో విడత భేటీకి ఎమ్మెల్యే లంతా లగేజీతో రావడం గమనార్హం. ఆ వెంటనే.. సీఎం ఇంటి వద్ద సిద్ధంగా ఉన్న మూడు బస్సుల్లో.. భారీ భద్రత నడుమ ఎమ్మె ల్యేలను తరలించారు. వీరిని కుంతీ జిల్లాకు తరలిస్తున్నట్లు అధికార కూటమి వర్గాలు తెలిపాయి. అయితే.. అక్కడి నుంచి బీజేపీ యేతర రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్ లేదా పశ్చిమబెంగాల్‌కు ఎమ్మెల్యేలను తరలించే అవకాశాలున్నాయంటూ వార్తలు వెలువడ్డా యి. ఎమ్మెల్యేలంతా పిక్‌నిక్‌కు వెళ్తున్నారని ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం వెల్లడించారు. అందుకోసం కుంతీ జిల్లాలోని ఓ రిసార్ట్ను బుక్ చేశామని వివరించారు. అయితే.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. క్యాంపు రాజకీయాలు ప్రారంభమ య్యాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
దీంతో అధికార పక్షం.. అది పిక్‌నికేనంటూ కొందరు ఎమ్మెల్యేలు లాత్రాతు డ్యామ్ వద్ద బోట్ షికారు చేస్తున్న వీడియోలను మీడి యాకు విడుదల చేసింది. సాయంత్రానికి ఎమ్మెల్యేలందరినీ రాంచీకి తరలించింది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీ లో సోరెన్ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో జార్ఖండ్ ముక్తి మోర్చా అతి పెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది సంకీర్ణ కూటమి.
గనుల లీజును సోరెన్.. తనకు తానే కేటాయించుకోవడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష బీజే పీ.. గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం సోరెన్ నిబంధనలను ఉల్లంఘిం చార ని.. సీఎంగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు అందించిన వినతిపత్రాన్ని గవర్నర్ రమేష్ బైస్.. ఎన్నికల సంఘానికి పంపించారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని గురువారం సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. ఈసీ సిఫార్సుతో సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.