పాదయాత్ర సజావుగా సాగాలి..అందుకు పోలీసులదే బాధ్యత.. హైకోర్టు తీర్పు
posted on Oct 21, 2022 @ 3:29PM
ఏపీలో ఇప్పుడు పొలిటికల్ సిట్యువేషన్ క్రిటికల్ గా ఉంది. అమరావతి వర్సెస్ మూడు రాజధానులపై పొలిటికల్ మ్యాచ్ హోరోహోరీగా సాగుతోంది. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజా మద్దతు ఉండగా.. వైసీపీ మూడు రాజధానుల పోరాటానికి అధికారులు దాసోహమంటూ అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడమే తన విధి అని భావిస్తున్నారు.
అమరావతి రైతులది స్వచ్ఛంద పోరాటం అయితే మూడు రాజధానుల ఐకాస పేరుతో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమం. ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చి అమరావతి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో జగన్ సర్కారు ఉంది. అయితే ప్రజా మద్దతుతో అమరావతి రైతులు తమ పాదయాత్రను దిగ్విజయంగా సాగిస్తున్నారు. కానీ దారిపొడవునా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ముళ్లు, రాళ్లూ రప్పలు, నీళ్ల సీసాలు దాడులు, అల్లరిమూకల దుర్భాషలను తట్టుకొని ముందుకు సాగుతున్నారు.
అయితే తాము తలపెట్టిన మహా ఉద్యమం.. చివరి గమ్యానికి చేరుకునే సమయానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్న అమరావతి రైతులు మరోసారి న్యాయస్థానాన్నిఆశ్రయించారు. రైతులపాదయాత్రకు అడ్డంకులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అమరావతి రైతు పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. కొద్దిరోజుల్లో విశాఖలో అడుగు పెట్టనుంది. విశాఖ క్యాపిటల్ రాజధాని వద్దంటూ చేపడుతున్న అమరావతి రైతులకు విశాఖపట్నంలో అడుగుపెట్టే హక్కు లేదంటూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరికలుజారీ చేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకూ వెనుకాడటం లేదు.
ఈ నేపథ్యంలోనే మహాపాదయాత్ర విశాఖ చేరుకునే సరికి శాంతి భద్రతల సమస్య సృష్టించైనా యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తున్నదన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. దీంతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు రైతులకు ఎటువంటి అవాంతరాలూ లేకుండా పోటీగా ఇతరులెవరూ నిరసన తెలపకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
మహాపాదయాత్రను అడ్డుకుంటున్నారంటూదాఖలైన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారించిన హైకోర్టు పాదయాత్ర సజావుగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కోర్టు ముందు వివరాలు ఉంచాలని గురువారం న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఇరుపక్షాలు వివరాలను సమర్పించాయి. ఇరువైపుల వాదనలు, వారు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం (అక్టోబర్ 21) తీర్పు వెలువరించింది.
పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని.. మద్దతు తెలిపేవారు రోడ్డుకు ఇరువైపుల ఉండి సంఘీభావం తెలపాలని పేర్కొంది. గతంలో పాదయాత్రలో పాల్గొనేందుకు ఏయే వాహనాలకు అనుమతి ఉందో ఆ వాహనాలు మాత్రమే పాదయాత్రలో ఉండాలని పేర్కొంది. ఇక రైతుల పాదయాత్ర సజావుగా జరిగేలా, వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.