కాంగ్రెస్ ను ఓడించండి.. రేవంత్ ను సాగనంపండి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియోలీక్
posted on Oct 21, 2022 @ 3:12PM
తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ టీపీసీసీ చీఫ్ ఎందుకు కన్నీటి పర్యంతమయ్యారో అర్ధమైపోయింది. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి కోసం పార్టీలోని సీనియర్లే గుట్టుగా పని చేస్తున్నారన్నది తేటతెల్లమైపోయింది.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి పార్టీలోనే కొందరు గట్టిగా పని చేస్తున్నారనడానికి ఆధారం వెలుగులోకి వచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ పరాజయ భారాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ పై మోపి.. ఆయనను ఆ పదవి నుంచి దించేయడానికి తెరవెనుక కుట్ర ఓ ఆడియో లీక్ ద్వారా బహిర్గతమైంది.
మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడి గెలుపు కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. స్టార్ క్యాంపెయినర్ అయి ఉండి కూడా మునుగోడులో ప్రచారానికి రానని ప్రకటించడం. నియోజకవర్గంలో అడుగుపెట్టనని శపథం చేయడమే కాకుండా.. చీటికీ మాటికీ టీపీసీసీ చీఫ్ రేంవత్ రెడ్డి పై విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో వెంకటరెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగీ లీక్ అయిన ఒక ఆడియో ఆ అనుమానాలన్నీ వాస్తవమేనని నిర్ధారించాయి. మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి ఓటేసి గెలిపించాలంటూ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే.. ఆటోమేటిగ్గా తానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానంటూ ఆయన ఫోన్ లో మాట్లాడిన మాటల తాలూకూ ఆడియో లీక్ అయ్యింది.
ఒక సారి తాను టీపీసీసీ అధ్యక్షుడినైతే రాష్ట్రమంతా పాదయాత్ర చేసైనా సరే కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తానని ఆయన చెప్పడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపించింది. అంతే కాదు.. పార్టీలను పట్టించుకోకుండా తన సోదరుడు రాజగోపాల రెడ్డికి ఓటేయండి.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటానంటూ రాజగోపాలరెడ్డి అనడం ఆ ఆడియోలో వినిపిస్తోంది.