ఎందుకు వస్తున్నారు? రావద్దు.. వైసీపీ నేతలపై తిరగబడిన ప్రజలు
posted on Aug 28, 2022 @ 5:17PM
మంచిచేస్తే నలుగురూ చెప్పుకుంటారు, ఆదరిస్తారు. ప్రజల మధ్య ఉండాల్సినవారు ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనడం కష్టం. ప్రజాభీష్టానికి తగ్గట్టు పాలన చేసినవారికే ఆదరణ ఉంటుంది. అధికారంలో ఉన్నామని విర్రవీగి, తోచినవిధంగా వ్యవహరిస్తే ప్రజలు ఓటర్లు లా కాకుండా తిరగబడతారు. ఎన్ని భ్రమలు పెట్టినా, ఎంత ఉచితాలు అందించినా, సంక్షేమపథకాలు, ప్రజారోగ్యం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి మాత్రమే చివరకు ప్రజాదరణను అందిస్తాయి. వీటిలో దేన్ని విస్మరించినా, నిర్లక్ష్యం చేసినా ప్రజలు తిరగబడతారు. ప్రజాహితం కోరుకునేవారు ప్రజాసంక్షేమాన్ని కోరుకోవాలి. పాలనాపర నిర్ణయాలు ప్రజలకు ఏమాత్రం ప్రయోజ నాన్ని కల్పిస్తాయన్న ఆలోచన ఉండాలి. అన్ని అంశాల్లోనూ ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకున్నవారినే ప్రజలు నాయకు లుగా, దేవుళ్లుగానూ గుర్తిస్తారు. అంతే తప్ప పథకాలపేర్లు మార్చి, ప్రచారం చేసుకోవడంతోనే కాలం గడిపేస్తే, ప్రజలు వెర్రిగా వెనకనే ఉంటారనుకోవడం శుద్ధ పొరపాటు.
ఏపీలో మూడేళ్ల పాలన పూర్తి అయిన తర్వాత కూడా ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటే అర్ధం జగన్ పాలన అంతగా ఆకట్టు కోలే దన్నది సుస్పష్టం. అన్ని రంగాల్లోనూ ప్రజలను దరిచేరలేదు. కేవలం విపక్షాన్ని తిట్టుకోవడం, దాడులు చేయడం తప్ప ప్రత్యే కించి రాష్ట్రంలో ఎలాంటి గొప్ప అభివృద్ధి ఈ మూడేళ్లలో జరగలేదన్నది విశ్లేషకుల మాట. ప్రజలు కూడా జగన్ మీద ఎంతో నమ్మకమే పెట్టుకున్నారు. ఇచ్చిన గొప్ప అవకాశాన్ని చేజేతులా పాడుచేసుకున్నది వైసీపీ. ప్రజాగ్రహానికి గురయిన నాయకు లు, పార్టీలు భవిష్యత్తులో ఇబ్బందులపాలవుతాయన్నది అనాదిగా గమనిస్తున్నదే. ఇపుడు వైసీపీకీ అదే పరిస్థితి ఏర్పడింది. గడప గడపకూ అంటూ ఒక కార్యక్రమం పెట్టుకుని తాము చేసిన గొప్పలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని ప్రజల వద్దకు వెళుతున్నారు. కానీ ప్రజలు వినడం, ఆదరించడం అనేది ఎప్పుడూ కనిపించలేదు. ప్రజలు జగన్ తమకు మోసం చేశాడన్న అభిప్రాయంలో ఉన్నారు.
రాష్ట్రంలో తమ గ్రామాలకు వస్తున్న వైసీపీ నేతలపై స్థానికులు తిరగబడుతున్నారు. ఎందుకు వస్తున్నారని నిలదీస్తున్నారు. కుప్పం గ్రామానికి కాన్వాయ్‌లలో వచ్చిన వైసీపీ నాయకులను స్థానికులు తరిమికొట్టారు. ఏం చేశారని మళ్లీ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు భద్రతగా వస్తున్న పోలీసులపై కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు రోజుల పర్యటనలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. వైసీపీ అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ శ్రేణులు గ్రామాల్లో తిరుగుతూ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం, బ్యానర్లు , ఫ్లెక్సీలు చించివేడం లాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. కుప్పంలో అన్నా క్యాంటిన్‌పై దాడులు చేసి, ర్యాలీలు నిర్వహించి బీభీత్సం సృష్టించిన విషయం విధితమే.