గడపగడపకు లో వెల్లువెత్తుతున్న నిరసన సెగలు
posted on Nov 2, 2022 @ 2:11PM
ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గడపగడపకూ కార్యక్రమంలో ప్రజల నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబుకు ప్రజా నిరసన ఎదురైంది. గడపగడపకూ కార్యక్రమంలో భాగంగా బుధవారం దొప్పర్ల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే కన్నబాబును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ పథకాల విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు వివక్ష చూపుతున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కన్నబాబుతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఒక దశలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధానికి గ్రామస్తులు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా జనం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక కర్నూలు జల్లాలో కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆదోనిలో గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడి లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలను వివరించబోగా.. ప్రజలు అడ్డుకుని చిన్న గుడిసెకు చూడా రూ.1600 ఇంటి పన్ను వస్తోందని నిలదీశారు.
దానిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించగా, తమకు వచ్చే పథకాలన్నీ ప్రజలు కట్టిన పన్నులే కదా అంటూ జనం ఎదురు ప్రశ్నించారు. జనం ఇంటి పన్ను, చెత్త పన్ను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. అయితే అది కుదరదు అని ఎమ్మెల్యే స్పష్టం చేసి.. ఆ తరువాత జనం నిరసనలను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయారు.