రేష్మానీని వెతికిచ్చిన ఆధార్
posted on Nov 2, 2022 @ 2:35PM
ప్రతీదానికి ఆధార్ కార్డు అడుగుతున్నారని విసుక్కుంటాం గాని అదే ఆధార్ కార్డు రేష్మానీని తనవారి వద్దకు చేర్చడా నికి ఉపయోగపడింది. వినడానికి చిత్రంగా ఉండవచ్చు గాని, ఇది వాస్తవం. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన రేష్మానీ గురించి తల్లిదండ్రులు, తెలిసినవారూ ఎంతో వెతికి వేసారారు. పిల్ల చనిపోయిం దేమో నన్న అనుమానాలు వచ్చాయి.
జార్ఖండ్ సింగ్బామ్జిల్లాలో ఒక గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం తిండికీ ఎంతో ఇబ్బంది పడుతూండేది. ఇంటో అందరకూ పనికి వెళ్లినా ఇల్లు గడిచే పరిస్థితి లేకపోయింది. ఇంటి బాధ్యతను రేష్మానీ తీసుకోవాల్సివచ్చింది. రోజూ వారీ కూలీ తప్ప మరేమీ తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉండగా రేష్మీకి ఉద్యోగం ఇప్పిస్తానని మంచి జీతం వస్తుంది, ఇంటికి ఎలాంటి కష్టమూ ఉండదని నమ్మ బలుకుతూ ఆమెకు ఒక వ్యక్తి దగ్గరయ్యాడు. ఆమె ఇంటిపరిస్థితుల వల్ల అతను చెప్పింది పూర్తిగా నమ్మవలసి వచ్చింది. రైలు ఎక్కిన కొంతసేపటికి అతని ప్రవర్తనలో చాలా తేడా గమనిం చింది రేష్మా. అంతే అతనికి తెలియకుండా ఫతేపూర్ లో దిగేసింది. అక్కడి పోలీసుల సాయంతో పేదల ఆవాస గృహానికి వెళ్లింది. అక్కడ ఆమెను బాగానే చూసుకున్నారు. కానీ అక్కడ ఆమె పేరు రాశీగా మార్చు కోవాల్సి వచ్చింది, ఆమె పరిస్థితుల కారణాల వల్ల.
కొంత కాలం అక్కడ గడిపిన రేష్మీ ఈ ఏడాది జూలై లో లక్నో చేరుకుంది. అక్కడి రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. ఆమె వచ్చిన పరిస్థితులు విని తెలుసుకుని ఆమెకు అండగా ఉండాలని ఆ సెంటర్ అధికారి ఆర్తీ సింగ్ ఆమెకు అన్ని వసతులు కల్పించారు. పని కోసం అవసరమై ఆధార కార్డు కు పేరు నమోదు చేయించుకున్నప్పుడు ఆమె అసలు పేరు చెప్పింది. కానీ రేష్మీ పేరుతో చాలా కాలం క్రిందటే కార్డు ఆధార్ కార్డు ఉండడంతో కొత్తగా నమోదు చేయడానికి సాంకేతికంగా వీలు కాలేదు. నాలుగయిదు పర్యాయాలు ప్రయత్నించగా చివరగా ఆమె పేరు, ఆధార్ నంబర్ తెలిసాయి.
దానితో ఆమె ఊరు, అడ్రస్ తెలిసి అధికారులు జార్ఖండ్ లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు తీసికెళ్లి అప్పగిం చారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత 23 ఏళ్ల రేష్మీ అలా ఇల్లు చేరింది. ఆధార్ ఆ విధంగా గొప్ప ఉపకారం చేసినందుకు లక్నో ఉదాయి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ ఎంతో ఆనం దించారు.