ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ.. చంద్రబాబుకు జనం జేజేలు

మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ప్రజలకు నిజమైన సంక్షేమం అందించాలన సత్సంకల్పంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... తన సంకల్పానికి నిధుల కొరత ఎంత మాత్రం అడ్డంకి కాబోదని చాటారు. సామాజిక పెన్షన్ల పంపిణీ విషయంలో తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు. జనం దృష్టిలో విశ్వసనీయతకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు నిలిచారన్నదానికి సెప్టెంబర్ నెల పెన్షన్లను ఒక రోజు ముందే పంపిణీ చేయడం ద్వారా మరో సారి అందరికీ అవగతమయ్యింది.

మాట ఇస్తే నెరవేర్చుకుంటానని బాబు మరోసారి నిర్ద్వంద్వంగా రుజువు చేసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని చెప్పే చంద్రబాబు అదే బాటలో ఎలాంటి తడబాటూ లేకుండా ముందుకు సాగుతున్నారు. ఎన్నికల సమయంలో పెన్షన్లపై ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పెన్షన్లను ఠంచనుగా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఒకటో తేదీనే పెన్షన్లను పంపిణీ చేసిన చంద్రబాబు సర్కార్ ఈ సారి ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 31వ తేదీనే పెన్షన్లను లబ్ధదారులకు అందిస్తోంది. శనివారం ( ఆగస్టు 31) తెల్లవారు జాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది.  జోరు వానను సైతం లెక్కచేయకుండా మంత్రులు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెల్లవారుజాము పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం మొద లైంది.  తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధంగా చెప్పిన సమయానికి పెన్షన్ పంపిణీ చేయడం వరుసగా ఇది మూడో నెల. గత జగన్ పాలనలో పెన్షన్లు ఎప్పుడు అందుతాయన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితి ఉండేది. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల పంపిణీ స్టీమ్ లైన్ అయ్యింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటో తేదీ పెన్షన్ పంపిణీ జరుగుతోంది. ఒక వేళ ఒకటో తేదీ ఆదివారం అయితే ఒక రోజు ముందే పెన్షన్లను పంపిణీ జరుగుతుందనడానికి ఈ సారి ఆగస్టు 31నే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తుండటం ఒక నిదర్శనం. 

 ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేస్తుండడంతో లబ్ధిదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.   పెన్షన్ల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి 36 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. గత ప్రభుత్వ అవగాహనారహిత పాలన కారణంగా ఖజానా ఖాళీ అయింది.   అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు సమయానికే పెన్షన్ నగదు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చేలా ఆదేశించడం కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావానికి అద్దంపడుతోందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.