ప్రియాంకకు పార్టీ పగ్గాలు.. కాంగ్రెస్ లో కానరాని ఆసక్తి
posted on Aug 25, 2022 @ 12:46PM
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కుంటే, పోయినదేదో దొరికే అవకాశం అంతో ఇంతో ఉంటుంది. అంతే కానీ, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కుంటే ఫలితం ఉండదు సరి కదా, ప్రయాస మిగులుతుంది. ఇప్పుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అచ్చం అలాగే, వుంది. నిజమే, కాంగ్రెస్ పార్టీకి గాంధీ నెహ్రూకుటుంబం ఒక అసెట్., అలాగే ఒక లయబిలిటీ కూడా. అందుకే, కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత రెండూ నెహ్రూ గాంధీ కుటుంబమే, అనే నానుడి ఒకటి బలంగా నాటుకు పోయింది.
కానీ, అదంతా గతం, ఇప్పుడు పరిస్థితి అది కాదు. నడుస్తున్న చరిత్రలో జరుగుతన్న పరిణామాలను గమనిస్తే, నెహ్రూ గాంధీ కుటుంబం బలం కంటే, బలహీనతే బలంగా కనిపిస్తోంది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, సోనియా గాంధీ చాలా వరకు కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయారు. పార్టీ మీద పట్టును నిలుపుకున్నారు. పడిలేచిన కెరటంలాగా, పదేళ్ళ విరామం తర్వాత అయినా, 2014లో కాంగ్రెస్ సారధ్యంలో సంకీర్ణ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమికను పోషించారు. అలాగే, తిరిగి 2009 మరో మారు కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ, 2014లో సోనియా, రాహుల్ గాంధీ సారధ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఓడి పోయింది. అధికారం కోల్పోయింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లోక్ సభలో పార్టీ బలం రెండంకెల (52) స్థాయికి పడిపోయింది. తిరిగి 2019లో తొలిసారిగా, రాహుల్ గాంధీ సారధ్యంలో అదే స్థాయిలో ఓడిపోయింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్ళు పూర్తవుతున్నాయి. ఈ నేపధ్యంలో మళ్ళీ మరోమారు కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం అందుకోగలదా? అంటే, అనుమానం లేకుండా అయ్యే పనికాదనే సమాధానమే వస్తోంది. నిజమే, ప్రస్తుతం తిరుగులేదన్నట్లు వెలిగి పోతున్న బీజేపీ వెలుగులు రేపటి 2024 ఎన్నికల్లోనూ, కాదంటే ఆ తర్వాత ఐదేళ్లకు వచ్చే, 2029 ఎన్నికల్లో కనుమరుగైతే కావచ్చును.కానీ, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుందా? చేయగలదా ? అంటే, నెహ్రూ గాంధీ కుటుంబ సారధ్యంలో అది అయ్యే పని కాదనే సమాధానమే వస్తోంది.
ఃనెహ్రూ నుంచి సోనియా గాంధీ వరకు, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఉపద్రవాలు ఎదురైనా నెహ్రూ గాంధీ కుటుంబం పార్టీని కాపాడుతూ వచ్చింది. ముఖ్యంగా ఇందిరా గాంధీ, ఒకటికి రెండు సార్లు నిట్టనిలువునా చీలినా పార్టీ మీద పట్టును నిలుపుకుంటూ వచ్చాను. చీలిక వర్గాలు కాలగతిలో కలిసిపోయాయి. ఇందిరాగాంధీ తర్వాత, రాజీవ్ గాంధీ, సోనియ గాంధీ ప్రత్యక్షంగా కాకుంటే పరోక్షంగానే అయినా పార్టీ మీద పట్టును నిలుపు కుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు, సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉన్నారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ తిరిగి కోలుకోవడం అయ్యే పని కాదని, అందరూ అంగీకరిస్తున్నారు.
ఓ వంక వరస ఓటములు పార్టీని వెంటాడుతుంటే, మరో వంక తరతరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పార్టీ వదిలి పోతున్నారు. అలాగే, ఇంతకు ముందు ఎప్పుడు లేని స్థాయిలో పార్టీలో అసమ్మతి రగులుతోంది. ఏకంగా 23 మంది పార్టీ సీనియర్ నేతలు, జీ 23 పేరిట ఒక అసమ్మతి వేదికను ఏర్పాటు చేశారు. అందులో సభ్యులుగా ఉన్నగులాం నబీ ఆజాద్,ఆనంద్’శర్మవంటి వంటి సీనియర్ నాయకులు పార్టీ పదవులు ఇస్తామన్నా వద్దంటున్నారు. సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితులు పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ సమీప భవిష్యత్ లో కోలుకోవడం, మళ్ళీ మరో మారు అధికారంలో భాగస్వామి కావడం కాని పనిగానే పరిశీలకులు భావిస్తున్నారు.
అదొకటి అలా ఉంటే రాహుల గాంధీ కాదంటే, ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రతిపాదన విషయంలోనూ పార్టీలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదని అంటున్నారు. ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లుగా, ప్రియాంక పేరు తెర మీదకు వచ్చినా ఫలితమ ఉండదని అంటున్నారు. అందుకే, రాహుల్ గాంధీ చెప్పినట్లుగా పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ నెహ్రూ కుటుంబం బయటి వారికి ఇవ్వడమే ఉత్తమమని, పరిశీలకులు అంటున్నారు.