ఇకపై దాడులు చేస్తే.. వాళ్లింటి కెళ్లి కొడతాం.. చంద్రబాబు
posted on Aug 25, 2022 @ 2:20PM
దాడులకు ప్రతి దాడులు తప్పవని వైసీపీకి చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేశారు. పోలీసుల అండతో దాడులు చేస్తుంటూ చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ కు ఇంకే పని లేదని విమర్శించారు. పరిపాలన అంటే విపక్షాలపై దాడులు చేయడమేననుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు స్వరంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతానికి భిన్నంగా ఆయన పరుష పదజాలంతో వైసీపీపై విరుచుకు పడ్డారు. ఆయన స్వరం పెంచారు. విమర్శల్లో వాడి పెంచారు. కుప్పంలో వైసీపీ శ్రేణుల ఆరాచకత్వంపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేస్తారా అంటూ రెచ్చిపోయారు. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్వాంటిన్ వరకూ పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో వైసీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటిన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన ఈ రోజు కుప్పం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు.
అన్నం పెట్టే అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడాన్ని నీచమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ హయాంలో వీధికో రౌడీని తయారు చేసి ప్రజలపైకి ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. పోలీసులు తిన్నగా వారి విధులు నిర్వర్తిస్తే ఈ రోజు కుప్పంలో అన్న క్యాంటిన్ ధ్వంసమయ్యేదా అని ప్రశ్నించారు. పోలీసు స్టేషన్ పక్కనే ఉన్నా నిర్భయంగా దాడి చేసి క్యాంటిన్ ను ధ్వంసం చేశారంటే అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పని చేస్తోందా అన్న అనుమానం వస్తోందని అన్నారు. కుప్పం నడిబొడ్డున ఇంత జరుగుతుంటే ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉన్నాడని నిలదీశారు. మా వాళ్లూ దాడులకు దిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ 60 వేల మంది పోలీసుల అండతో రెచ్చిపోతోందనీ, అదే మాకు (తెలుగుదేశం)కు 60 లక్షల కార్యకర్తల సైన్యం ఉంది జాగ్రత్త అని హెచ్చరించారు. అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేసిన వారిని పోలీసు స్టేషన్ కు కాకుండా వాళ్ల ఇళ్లకు తీసుకెళ్లి దిగబెట్టి వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మాపై దాడులు చేస్తే వారి ఇళ్ల కెళ్లి కొట్టి వస్తామని హెచ్చరించారు.
వైసీపీ మూడేళ్ల పాలనలో పలు చోట్ల తన పర్యటనలను అడ్డుకోవడం తప్ప జగన్ ప్రభుత్వం ఏం చేసింది లేదని విమర్శించారు. దాడులు చేసి భయపెట్టి గెలవాలనుకుంటున్న వైసీపీ పన్నాగాలు పారవని హెచ్చరించారు. దాడులకు బయపడేది లేదన్నారు. వైసీపీపై, పోలీసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అలాగే వైసీపీ అరాచకాలపూ రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. వైసీపీ ఆగడాలపై జనం గళమెత్తాలని పిలుపునిచ్చారు. జనం మౌనంగా ఉంటే వైసీపీ రౌడీలు వారి ఇళ్లపైకి వస్తారని అన్నారు. తన తీరు ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇకపై ఒక లెక్కగా ఉండబోతోందని చంద్రబాబు అన్నారు. తన శైలికి భిన్నంగా ఇకపై కఠినంగా ఉండక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు.
తాను సొంత నియోజకవర్గంలో పర్యటనకు వస్తే సిగ్గులేని ప్రభుత్వం బస్సులను నిలిపివేసింది. పాఠశాలలకు సెలవు ఇచ్చేసింది. ఏమిటి.. ఈ సర్కార్ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. వైసీపీ దాడులు, అరాచకాలపై ఇంకా తెలుగుదేశం కార్యకర్తలను కట్టడి చేయడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. వైసీపీ వాళ్లు కూల్చిసిన దగ్గరే అన్న క్యాంటిన్ లో బోజనం పెడుతున్నానని అన్నారు. అన్న క్యాంటిన్ ఇక్కడే కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులు కూల్చివేసిన అన్న క్యాంటిన్ ను అక్కడే ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన చంద్రబాబు అక్కడ నుంచి వెళ్లిన కొద్దివ్యవధిలోనే ఆ క్యాంటిన్ వద్దకే భోజనాలు చేయడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చారు.
పుంగనూరు నుంచి తమను బస్సుల్లో తీసుకు వచ్చి కనీస ఏర్పాట్లూ కూడా చేయలేదని కుప్పం వైసీపీ నేతలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్న వైసీపీ కార్యకర్తల బాధను చూసి తెలుగుదేశం శ్రేణులు వారికి అన్న క్యాంటిన్ లో భోజనాలు పెట్టారు. తాము కూల్చేసిన అన్న క్యాంటిన్ లోనే వైసీపీ కార్యకర్తలు భోజనాలు చేశారు.