బీజేపీకి జనసేన ఝలక్?
posted on Mar 27, 2021 @ 8:33PM
తిరుపతి బరిలో బీజేపీ. జనసేన మద్దతుతో పోటీలో మాజీ ఐఏఎస్ రత్నప్రభ. అభ్యర్థిని ప్రకటించాక బీజేపీ పెద్దలంతా కలిసి హైదరాబాద్ వెళ్లి జనసేనానిని కలిశారు. గెలుపు వ్యూహంపై చర్చించామన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది.. మరి అంతా కలిసి పని చేస్తారా? బీజేపీ విజయం కోసం జనసేన మనస్పూర్తిగా సహకరిస్తుందా? ఇదే ఇప్పుడు అనుమానాస్పదం.
తిరుపతి నుంచి ఎలాగైనా పోటీ చేయాలని జనసేన గట్టిగా ప్రకటించింది. ఉమ్మడి అభ్యర్థిపై మొదట చొరవ తీసుకున్నది పవన్ కల్యాణే. కొన్ని వారాల క్రితమే ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారు. కేండిడేట్ సెలక్షన్ కోసం ఓ కమిటీని వేశారు. ఆ కమిటీలోనూ తామే పోటీ చేస్తామంటూ గాజుగ్లాసు గంటా పథంగా చెప్పింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన జనసేనకు ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కలన్నీ బయటకు తీసి మరీ కమిటీ ముందేసింది. తిరుపతిలో బీజేపీ కంటే తామే బలవంతులమని.. ఎంపీ టికెట్ తమకు ఇవ్వడమే న్యాయమని తేల్చి చెప్పింది. కానీ, లోలోపల ఏం జరిగిందో ఏమో గాని.. కమలం పార్టీనే ఎంపీ టికెట్ ఎగరేసుకుపోయింది. అయితే తిరుపతి సీటును జనసేన కావాలనే వదిలించుకుందనే చర్చ జరుగుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఇమేజ్ ఫుల్‌గా డ్యామేజ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపార్టీతో దూరంగా ఉండటమే బెటరనే అభిప్రాయానికి జన సైనికులు వచ్చారంటున్నారు.
ఇప్పటికే తెలంగాణ బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటున్నారు పవన్. వారి మధ్య మిత్రబేధం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే పార్టీతో తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా ఉండటం సాధ్యమా? ఇదే అనుమానం కమలనాథులకు కూడా వచ్చింది. తిరుపతిలో జనసేన సపోర్ట్ లేకుండా గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీకి బాగా తెలుసు. అందుకే, పవన్ కల్యాణ్ మనసు మారకముందే ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు రత్నప్రభను వెంటేసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పురంధేశ్వరి తదితరులు పీకే ఇంట్లో వాలిపోయారు. మీ మద్దతు మాకేనంటూ.. ఇందులో తేడా వద్దంటూ.. మరోసారి మాట తీసుకున్నారు. అయితే.. ఆ మీటింగ్ తర్వాత.. ఫార్మాలిటీకి కూడా పవన్ కల్యాణ్ మాట్లాడలేదు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని పిలుపు ఇవ్వలేదు. అంటే, తిరుపతి విషయంలో జనసేన ఇంకా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టేగా అంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణలో తమను చిన్న చూపు చూసిన బీజేపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు జనసేన కత్తులు దూస్తోంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీకి పోటీగా జనసేన నుంచి సైతం అభ్యర్థిని నిలపాలని ఆలోచిస్తోంది. సాగర్ బరిలో కమలనాథులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపి పొలిటికల్ ఎక్స్‌పర్మెంట్ చేయనుంది. అందుకు కౌంటర్‌గా జనసేన కూడా ఎస్టీ కేండిడేట్‌ను నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. ఇలా.. తెలంగాణలో కమలం వర్సెస్ జనసేన ఎపిసోడ్ రక్తికట్టబోతోంది. ఆ ప్రభావం తిరుపతి ఎంపీ ఎలక్షన్ల్స్‌పై ఎక్కడ పడుతుందోననే టెన్షన్ ఏపీ బీజేపీని వేధిస్తోంది.
పవన్ కల్యాణ్ ఆడుతున్న డబుల్ గేమ్ తిరుపతిలో బీజేపీ పుట్టి ముంచేలా కనిపిస్తోంది. జనసైనికుల మద్దతు లేకపోతే ఆ పార్టీకి తిరుపతిలో డిపాజిట్ రావడం కూడా కష్టమేనంటున్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీకి అధికార బలం ఉంది. బీజేపీ కేండిడేట్ రత్నప్రభ రాజకీయాలకు కొత్త. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి జనసేనే దిక్కు. కానీ, జనసేనాని మాత్రం కమలనాథులపై అలక పూనడం ఆ పార్టీని కలవరానికి గురి చేస్తోంది. అందుకే, బీజేపీ రాష్ట్ర నేతలంతా కలిసి రాష్ట్రం దాటి వెళ్లి మరీ, పవన్ కల్యాణ్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారంటున్నారు. అయితే జనసేనాని నుంచి నామమాత్ర స్పందనే రావడంతో.. కమలనాథుల మదిలో కలవరమే...