సీఎం ఇల్లుల్లు తిరిగినా జానాదే విజయం!
posted on Mar 27, 2021 @ 8:33PM
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం నాగార్జున సాగర్ ప్రజలకు వచ్చిందన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరి డబ్బుతో ఓట్లను పంచి ప్రజాస్వామ్మాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను గ్రామాలకు డబ్బు సంచులతో పంచి గెలిచేందుకు పావులు కదువుతున్నారని ఆరోపించారు. బ్రోకర్ పని చేసే వారికి టీఆర్ఎస్‌లో టికెట్లు, పదవులు కట్టబెడుతుందన్నారు వెంకట్ రెడ్డి. నల్గొండ జిల్లాలో అలాంటి వారే ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారని దుయ్యబట్టారు. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. డబుల్ బెడ్ రూమ్, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి అంటూ దొంగమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఎంపీ వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
అవినీతి రహిత జానారెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి జననేతగా జానారెడ్డి ఎదిగారని తెలిపారు. ఇక్కడ మంత్రులు, సీఎం వచ్చి మకాం వేసిన జానారెడ్డి గెలుపును ఆపాలేరని స్పష్టం చేశారు. గ్రామాల నుంచి సర్పంచ్ తప్ప గ్రామ ప్రజలు ఎవరు టీఆర్ఎస్‌లోకి వెళ్లట్లేదని యావత్ నాగార్జున సాగర్ ప్రజలు జానారెడ్డికి మద్దతుగా నిలిచారని తెలిపారు. జానారెడ్డి, తాను కలిసి కాంగ్రెస్ హయంలో రూ. 2వేల కోట్లతో ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం 90 శాతం పనులు పూర్తిచేస్తే ఏడేళ్లుగా టీఆర్ఎస్ సర్కార్ మిగిలిన పనులకు నిధులు కేటాయించట్లేదని కోమటిరెడ్డి ఆరోపించారు. ఏఎన్ఆర్‌పీ వరద కాలువ జానారెడ్డి చొరవ వల్లే జరిగిందన్నారు.