యాదాద్రి టెంపులో కరోనా కలకలం
posted on Mar 27, 2021 @ 10:02PM
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం రేపింది. ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా సోకింది. శుక్రవారం చేసిన పరీక్షల్లో ఆరుగురిని కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆలయ సిబ్బందికి మొత్తం పరీక్షలు చేశారు. అందులో 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. గత వారమే వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆలయ సిబ్బందికి వైరస్ సోకింది. దీంతో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిలో దైవదర్శనాలకు మాత్రమే భక్తులకు అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో అధికారులు కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహోత్సవాల నిర్వహణ సమయంలో కరోనా నియమాలను ఏమాత్రం పాటించకపోవడం వల్లే ఆలయ సిబ్బందికి కరోనా సోకినట్లు విమర్శలు ఉన్నాయి. అలంకార సేవోత్సవాలు, స్వామి వారి విశేష వేడుకల్లో భౌతిక దూరం, మాస్క్‌లు ధరించకపోడం, శానిటైజేషన్ చేయకపోవడం కారణాలుగా తెలుస్తున్నాయి
మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైంది తెలంగాణ సర్కార్. కఠిన చర్యలకు దిగింది.రానున్నది పండుగల సీజన్ కావడంతో బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 61 వరకు గల సెక్షన్ల కింద అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. మాస్క్ నిబంధన కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.ఏప్రిల్ 10 వరకు రాష్ట్రంలో సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరించింది.ర్యాలీలు, యాత్రలపైనా నిషేధం ప్రకటించింది. హోలీ, రంజాన్, ఉగాది, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమి వేడుకలపైనా ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 188 సెక్షన్ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది.