కాంగ్రెస్... టీఆర్ఎస్... మధ్యలో బీజేపీ.... హుజూర్ బరిలో మిగిలింది 28మందే...
posted on Oct 4, 2019 @ 11:32AM
హుజూర్ నగర్ ఉప పోరులో కీలక ప్రక్రియ ముగిసింది. ఫైనల్ గా బరిలో నిలిచిందెవరో తేలిపోయింది. నిజామాబాద్ ను తలపించేలా పోటాపోటీగా పెద్దఎత్తున నామినేషన్లు దాఖలైనా, స్క్రూటినీ, విత్ డ్రాస్ తర్వాత బరిలో 28మంది మాత్రమే నిలిచారు. హుజూర్ నగర్లో మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఏకంగా 45 తిరస్కరణకు గురయ్యాయి. మరో ముగ్గురు పోటీ నుంచి తప్పుకున్నారు. దాంతో హుజూర్ నగర్ ఉప పోరులో 28మంది మాత్రమే మిగిలారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి 16మంది పోటీపడగా, ఉపపోరులో మాత్రం ఆ సంఖ్య అటూఇటుగా దాదాపు రెట్టింపు అయ్యింది.
అయితే, ప్రధానంగా అధికార పార్టీ టీఆర్ఎస్... ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే పోటీ ఉన్నప్పటికీ, బీజేపీ కూడా రేసులో ఉన్నామని చెబుతోంది. అయితే, ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అధికార టీఆర్ఎస్... అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, విచ్చలవిడిగా డబ్బు, మద్యం వెదజల్లుతోందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, గెలుపు మాత్రం తమదేనని అటు కాంగ్రెస్... ఇటు బీజేపీ చెబుతున్నాయి. అయితే, ఏదోరకంగా హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతాలని టీఆర్ఎస్ కంకణం కట్టుకుంది. మరి హుజూర్ నగర్ లో ఏ జెండా ఎగురుతుందో మరో మూడు వారాల్లో తేలిపోనుంది.