జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా?
posted on Nov 6, 2015 @ 10:38AM
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టనైతే పెట్టారు కానీ ఇప్పటి వరకూ ఆయన ఎన్నికల్లో నిలిచింది లేదు. అయితే ఇప్పుడు త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో తన పార్టీ నుండి అభ్యర్ధులను బరిలోకి దించేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల గుర్తింపు వచ్చాక పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలె గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయి. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని గట్టిగానే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఒకవేళ పోటీ చేస్తే స్వతంత్రంగా పోటీ చేస్తారా లేక.. బీజేపీ-టీడీపీ కూటమితో బరిలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందకుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీ-టీడీపీ తో కలిసి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారట. పవన్ కళ్యాణ్ కూడా దీనికి సానుకూలంగానే స్పందించారట. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.