మెతగ్గా ఉంటే బదిలీ అయినట్టే..!
posted on Nov 6, 2015 @ 10:10AM
ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఏడాది జూన్ 2 నాటికి హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులంతా విజయవాడకి రావాలని అంటున్నారు. కానీ ఉద్యోగుల వ్యవహారం చూస్తుంటే మాత్రం ఇప్పుడప్పుడే హైదరాబాద్ ను విడిచి వచ్చేలా కనిపించడంలేదని తెలుస్తోంది. దీంతో అసలు ఉద్యోగుల తరలింపు సాధ్యమయ్యేనా అని ఇప్పుడు సందేహాలు మొదలవుతున్నాయి.
ఎందుకంటే చంద్రబాబు చెప్పనైతే చెప్పారు కానీ మరీ గట్టిగా చెప్పకుండా ఏదో ఉద్యోగులు బాధపడతారు అన్న సంకోచంలో చెప్పడం.. అందులోనూ ఆఫ్షన్లు ఇచ్చిమరీ మీరెప్పుడు వస్తారు అని అడగటంతో ఉద్యోగులు కూడా అప్పుడే వెళ్లడానికి ఆసక్తి చూపించడంలేదు. దీనిపై గతంలో సచివాలయ ఉద్యోగులు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో కూడా మాట్లాడారు. ఇలా ఆఫ్షన్లు ఇస్తే పనులు జరగవని.. ఉద్యోగులను అలా విడతల వారిగా కాకుండా.. ఒక్కొక్క శాఖను పూర్తిస్థాయిలో తరలిస్తే బావుంటుందని చెప్పారు.
అంతేకాదు ఈ విషయంపై ఉన్నతాధికారులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖకు కొందరిని తరలించుకుంటూ పోదాం అనుకుంటే.. ఎప్పటికీ పూర్తి కాదని.. ప్రభుత్వం అడుగుతున్నంత సేపు ఉద్యోగులు ఎన్ని రకాలుగా అయిన మాట్లాడుతుంటారని.. ప్రభుత్వం మెతగ్గా వ్యవహరించకుండా కాస్త గట్టిగా ఉంటేనే ఈ తరలింపు సాధ్యమవుతుందని.. చంద్రబాబునాయుడు కూడా మెతగ్గా వ్యవహరించరాదని ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.