మంత్రి... ఆయన భార్య కంత్రీ
posted on Nov 6, 2015 @ 10:54AM
కర్ణాటక రాష్ట్ర మంత్రి ఆంజనేయ లంచం కేసులో చిక్కుకున్నారు. ఆయన స్వయానా లంచం తీసుకుంటే అన్ని జాగ్రత్తలూ తీసుకునేవారే. కానీ ఆయన భార్యగారు లంచం తీసుకోవడంలో అజాగ్రత్తగా వుండటం వల్ల మీడియాకి దొరికిపోయారు. ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఒక టెండర్ని మంత్రిగారికి చెప్పి తనకే దక్కేలా చూడాలని కోరుతూ ఒక వ్యక్తి మంత్రి గారి భార్యను ఆశ్రయించారు. మంత్రిగారిని మించిన కంత్రీగారు అయిన ఆ భార్యామణి సరేనని అతనికి అభయం ఇచ్చింది. దాంతో ఆ వ్యక్తి ఆమెకు ఏడు లక్షల రూపాయల లంచం ఇచ్చాడు. టోటల్‌గా ఏంటంటే, ఇదంతా స్టింగ్ ఆపరేషన్లో రికార్డు అయింది. సదరు వ్యక్తి మంత్రిగారి కంత్రీకి ఇచ్చిన డబ్బు కూడా అసలు కాదు.. పక్కా నకిలీవి. ఈ ఉదంతం అంతా కర్ణాటక టీవీ ఛానళ్ళలో ప్రసారం అయింది. దీంతో ప్రతిపక్షాలు మంత్రిగారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఆంజనేయ మాత్రం తన భార్యకి ఏ పాపమూ తెలియదని, తమ మీద ఏదో కుట్ర జరిగిందని వాపోతున్నాడు.