మద్యం సేవించి బస్సు నడిపిన డ్రైవర్‌కు జైలు

హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తప్పవన్న సంగతి మరో సారి నాంపల్లి కోర్టు తీర్పుతో వెల్లడైంది.   మద్యం సేవించి ప్రయాణికులతో నిండిన  బస్సును నడిపిన డ్రైవర్‌కు నాంపల్లి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించింది. ఇంటర్‌సిటీ యూనివర్సల్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న కన్నెబోయిన మహేష్‌బాబు అనే వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి ఆ మత్తులో బస్సు నడిపినట్లు గా రుజువు కావడంతో  నాంపల్లి కోర్టు అతనికి జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా కూడా విధించింది.

గతేడాది డిసెంబర్ 15న ఎస్‌ఆర్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లోకన్నెబోయిన మహేష్‌బాబు  పట్టుబడ్డాడు. మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు అనుమానం రావడంతో పోలీసులు వెంటనే బస్సును ఆపి డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వ హించారు.ఆ పరీక్ష లో  డ్రైవర్ రక్తంలో 119.100 mg ఆల్కహాల్ సాంద్రత ఉన్నట్లు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇతను అనుమతించిన పరిమితికి చాలా ఎక్కువగా మద్యం సేవించినట్లు  తేలడంతో  పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరు పరచారు.

కోర్టు విచారణలో పోలీసులు  మద్యం సేవించి భారీ వాహనాన్ని నడపడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడు తుం దని వాదించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకా శముందని పోలీసులు కోర్టుకు వివరించారు.

వాదనలు, ఆధారాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం డ్రైవర్‌కు 15 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని... ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని ఈ తీర్పు ద్వారా కోర్టు వెల్లడించింది.
ఈ తీర్పుతో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంతటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మరోసారి స్పష్ట మైంది. ముఖ్యంగా ప్రజా రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు అత్యంత బాధ్యతగా వ్యవహరిం చాలని పోలీసులు సూచిస్తున్నారు.

న్యూ ఇయర్ వేళ జపాన్‌ను కుదిపేసిన భూకంపం

 కొత్త సంవత్సరం ప్రారంభ వేళ జపాన్‌ను  భారీ భూకంపం కుదిపేసింది. జపాన్‌ తూర్పు నోడా  తీర ప్రాంతంలో బుధవారం (డిసెంబర్ 31) భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.   నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు.  అయితే గత కొన్ని వారాలుగా జపాన్ లో తరచూ భూమి కంపిస్తున్నది. డిసెంబర్ 8న జపాన్ ను రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో సంభవించిన భూకపంపం అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం కారణంగా దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.  

జింక మాంసం విక్రయిస్తున్న చికెన్ షాన్ ఓనర్ అరెస్టు

హైదరాబాద్లో అక్రమంగా జింక మాంసం విక్రయిస్తున్నఓ చికెన్ వ్యాపారిని పోలీసులు అరెస్టు చేశాడు. ఈ ఘటన అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.  ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 233 ప్రాంతంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న మహమ్మద్ ఇర్ఫాన్ ఉద్దిన్‌ జింక మాంసం విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు అతడి షాపులో తనిఖీలు నిర్వహించి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్బు హసన్ అలి  జింక మాంసాన్ని తీసుకొచ్చి ఇర్ఫాన్‌కు అందించేవాడనీ, ఆ మాంసాన్ని తన చికెన్ షాప్ ద్వారా మహ్మద్ ఇర్ఫాన్ విక్రయించేవాడనీ తేలింది.  అయితే మహమ్మద్ అబ్బు హసన్ అలి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. ఇర్ఫాన్ వద్ద నుంచి జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 

పందెం కోసం పెన్ను మింగేశాడు!

తోటి విద్యార్థులతో పందెం కాసి పెన్ను మింగేసిన విద్యార్థి ఉదంతమింది. అలా పెన్ను మింగేసిన మూడేళ్ల తరువాత తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రి పాలయ్యాడు. స్కానింగ్ లో కడుపులో పెన్ను ఉందని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా పెన్ను బయటకు తీసి అతడి  ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెడితే..   గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాతల కుమారుడు మురళీకృష్ణ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడేళ్ల కిందట అంటే అతడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. స్నేహితులతో పందెం కాసి పెన్ను మింగేశాడు. ఆ విషయం ఇంట్లో చెప్పలేదు.  ఈ మూడేళ్లుగా తరచుగా కడుపునొప్పి వస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే తాజాగా  గత నెల 18న  తీవ్రమైన కడుపునొప్పితో ప్రాణాపాయ స్ధితికి చేరుకున్నాడు.  దీంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు సర్వ జనాస్పత్రికి తీసుకు వెళ్లారు, అక్కడ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి పెన్ను ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ అవసరం లేకుండానే పెన్నును బయటకు తీసి అతడి ప్రాణాలు కాపాడారు.    

జర్మనీలో తెలుగు విద్యార్థి దుర్మరణం

జర్మనీలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన తోకల హృతిక్‌ రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీవెళ్లాడు. అతడు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భవనం పై అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతడి వయస్సు 24 ఏళ్లు.   చదువుల్లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన తోకల హృతిక్‌ రెడ్డి   మృతి వార్త తెలియడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది ఈ అగ్నిప్రమా దం ఎలా సంభవించిందనే అంశంపై జర్మనీ పోలీసులు విచారణ చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో భద్రతా చర్యల్లో లోపాలున్నాయా? అగ్నిమాపక వ్యవస్థ పనిచేసిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

2025.. ఏపీకి పెట్టుబడుల నామ సంవత్సరం

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి 2025 సంవత్సరం పెట్టుబడుల నామ సంవత్సరంగా  మారింది.  ఇక్కడా, కేంద్రంలోనూ కూడా ఎన్డీయే సర్కార్ అధికారంలో ఉండటం.. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా  ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో తమ పరిశ్రమల ఏర్పాటుకు వరుస కట్టాయి.  ఈ ఏడాది రాష్ట్రానికి భారీగా ప్రాజెక్టులు రావడంతో పారిశ్రామిక రంగానికి ఇది స్వర్ణ వత్సరంగా మారిందని చెప్పవచ్చు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు సర్కర్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేసింది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో  2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు,  ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పి. నారాయణ వివిధ దేశాల్లో పర్యటించి.. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించారు. ఆ కారణంగా విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు సూపర్ డూపర్ సక్సెస్ అయింది. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. దీంతో విశాఖపట్నం మాత్రమే కాదు.. రాష్ట్ర ముఖ చిత్రం మారనుంది. ఇక గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్పోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖపట్నంలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ. లక్షన్నర కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.  విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో సుమారు రూ.13 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది.  640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవి కార్యరూపం దాలిస్తే.. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం వేదికగా ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. రూ. 93 వేల కోట్ల పెట్టుబడితో ఈ డేటా సెంటర్‌తోపాటు ఏఐ కేంద్రాన్నీ ఏర్పాటు చేయనుంది. అలాగే రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ ఏర్పాటు చేయనుంది. అలాగే పలు ప్రముఖ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని చెప్పడానికి 2025 సంవత్సరంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు వరుస కట్టడమే నిదర్శనం.    ఇదే విశాఖ వేదికగా టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.  ఇక బీపీసీఎల్  నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ. 96 వేల కోట్లతో అయిల్ రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో అర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణం  ద్వారా ఏవియేషన్ రంగంలో నిపుణులను తయారు చేయనుంది. ఇక విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రంయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. 2026 జనవరి 2వ తేదీన ఈ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కానుంది.  ఢిల్లీ నుంచి వచ్చే ఈ విమానంలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు విజయనగరం ఎంపీ కె. అప్పలనాయుడు రానున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టాలరెన్స్.. సజ్జనార్

నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తాగి వాహనం నడపడం కూడదని హైదరాబాద్ సీపీ సజ్జనార్ మందుబాబులకు సూచించారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పిన సజ్జనార్.. న్యూ ఇయర్ వేడుకలకు అర్ధరాత్రి దాటిన తరువాత ఒక గంట మాత్రమే సమయం ఇచ్చినట్లు చెప్పారు. ఒంటి గంటకల్లా వేడుకలు ముగించేయాలన్నారు.   బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి క్షేత్ర స్థాయి పోలీసు అధికారులతో బుధవారం (డిసెంబర్ 31) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జనార్ ఈ సందర్భంగా  భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సౌండ్ సిస్టమ్స్ వినియోగించినా,  వైన్ షాపులు, బార్ల సమయం ముగిశాక ‘బ్యాక్ డోర్’ ద్వారా మద్యం విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.   బుధవారం (డిసెంబర్ 31) రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో 'డ్రంక్ అండ్ డ్రైవ్' సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం మత్తులో పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు, వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జనవరి మొదటి వారం వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాగి డ్రైవ్ చేస్తే పట్టుబడకుండా తప్పించుకునే మార్గాలే లేవని హెచ్చరించిన సజ్జనార్..  డ్రంక్ డ్రైవింగ్‌పై   జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నట్ల చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు బడితే.. చంచల్ గూడ జైలకేనన్నారు.   హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగ చేస్తే క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. న్యూఇయర్ సందర్భంగా  అర్ధరాత్రి వేళల్లో క్యాబ్, ఆటో సేవలను నిరాకరించడం లేదా బుక్ చేసిన చార్జీల కంటే అధికంగా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు  తప్పవని హెచ్చరించారు.  

తెలంగాణ తిరుమల యాదాద్రి ఉన్నా.. అందరి బాటా తిరుమలేనా?

కేసీఆర్ జ‌మానాలో వెయ్యి కోట్లు ఖ‌ర్చు చేసి  యాదాద్రిని భూత‌ల వైకుంఠ‌మా అన్న‌ట్టుగా  తీర్చి దిద్దారు. అదేం వింతో- విడ్డూర‌మో- విచిత్ర‌మో.. తెలంగాణ‌ సీఎం రేవంత్ ద‌గ్గ‌ర్నుంచి మొద‌లు పెడితే, బీఆర్ఎస్ నాయకులు  స‌హా అందరూ ముక్కోటి సంద‌ర్భంగా తిరుమ‌ల బాట ప‌ట్టారు.. కార‌ణ‌మేంటి? అంటే తిరుమ‌ల‌వెంక‌న్న‌క‌న్నా మించిన క‌లియుగ దైవం లేద‌నా?  లేక యాదాద్రి ప్రముఖ్యతను గుర్తించడం లేదా అన్న చర్చకు తెరలేచింది.   వాస్తవానికి తిరుమ‌ల ఈ స్థాయిలో ఉండ‌టానికి ఇక్క‌డి  పూజారి  వ్య‌వ‌స్థ ఎంతో ముఖ్య‌ కారణమని అంటారు. ఆ వ్యవస్థే తిరుమ‌ల‌ను మిగిలిన ఏ ఆల‌యం కన్నా కూడా మిన్నగా నిలుపోందని చెబుతారు.  ఎవ‌రైతే ఆ ఆల‌యంలో సాక్షాత్ వైకుంఠంలో జ‌రిగిన‌ట్టే అన్ని పూజాదికాల‌ను జ‌రుపుతారో ఆ ఆల‌యం ఇల వైకుంఠం అవుతుంది. తిరుమ‌ల ఆల‌యం కన్నా పెద్ద ఆల‌యాలు లేక పోలేదు. శ్రీరంగం తిరుమ‌లకే కాదు ఏకంగా, వైష్ణ‌వ మ‌తానికే కేంద్ర కార్యాల‌యం. కానీ, తిరుమ‌ల శ్రీరంగం, తిరువ‌నంత‌పురం ప‌ద్మ‌నాభ స్వామి వారి ఆల‌యాల‌కు మించిన ప్రాభ‌వాన్ని,  వైభ‌వాన్ని సొంతం చేసుకుందంటే అందుకు కార‌ణం ఇక్క‌డ జ‌రిగే క్ర‌తువులు అన్నీ ఆగ‌మ శాస్త్ర బ‌ద్ధంగా ఉంటాయి. ఇక తిరుమ‌ల  శ్రీవారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఎలా వ‌చ్చిందో చూస్తే.. అప్ప‌ట్లో అంటే..  14వ శ‌తాబ్దంలో తురుష్కులు.. శ్రీరంగంపై దండెత్తుతున్నార‌ని తెలిసి అక్క‌డి దేవ‌తా  విగ్ర‌హాల‌న్నిటినీ తిరుమ‌లకు త‌ర‌లించి.. ఇక్క‌డి  నుంచే  రంగ‌నాథుడికి నిత్య కైంక‌ర్యాల‌ను సాగించేవారు. అందులో భాగంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం వంటి ఏర్పాట్లు శ్రీనివాసుడి  స‌మ‌క్షంలో జ‌ర‌ప‌డం మొద‌లైంది. అందుకే ఇక్క‌డ తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలో  ఉన్న రంగ‌నాథ మండ‌పం   ఆనాటి రంగ‌నాథుడు తిరుమ‌ల‌లో ఉన్నాడ‌ని చెప్ప‌డానికి గుర్తుగా నిలుస్తుంది. అయితే, త‌ర్వాతి  కాలంలో రంగ‌నాథుడు తిరిగి శ్రీరంగం వెళ్లిపోయినా.. ఇక్క‌డ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఒక ఆచారంగా నిలిచిపోయింది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం అన్ని వైష్ణ‌వాల‌యాల్లో ఒక ఆన‌వాయితీగా వ‌చ్చింది. అందులో భాగంగా యాదాద్రి ల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారి ఆల‌యంలోనూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. అయినా తెలంగాణ తిరుమ‌ల అయిన యాదాద్రి కంటే.  రాష్ట్ర నాయకులు, వీరిలో ఆంధ్ర ఆధిపత్యం అంటూ నిత్యం విమర్శలు గుప్పించేవారు కూడా తెలంగాణ తిరుమల కంటే తిరుమల వెంకన్న దర్శనమే మిన్న అన్నట్లుగా తిరుమల బాటే పడుతుంటారు. తిరుమలలో తెలంగాణ పొలిటీషియన్లకూ ప్రొటోకాల్ కావాలంటూ తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తుతుంటారు. కానీ తెలంగాణ తిరుమల అయిన యాదాద్రిని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటూ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో అపచారం.. కపాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసం

సుప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో  ఘోర అపచారం జరిగింది. సప్తగోదావరి తీరాన ఉత్తర గోపురం వద్ద ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం (డిసెంబర్ 29 రాత్రి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం (డిసెంబర్ 30) ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై   స్థానికులు, భక్తులు తీవ్ర  ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు.  శివలింగాన్ని సుత్తి వంటి  ఆయుధంతో కొట్టి ధ్వసంం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే  కోససీమ జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని   పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు అక్కడి ఆధారాలను సేకరించారు. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో, చుట్టుపక్కల ఉన్న కెమెరాల ఫుటేజీని పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. మంత్రి ఆనం స్పందిస్తూ.. ధ్వంసమైన చోట ఇప్పటికే వేద పండితుల సమక్షంలో కొత్త శివలింగాన్ని పునఃప్రతిష్ఠించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఖండించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, హిందూ ధర్మంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2 నుంచి 9 వ తేదీ వరకూ దాదాపు 21.80 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసుపుస్తకాలను రైతులకు అంద జేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక వేళ ఆ పాసుపుస్తకాలలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కోసం ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నారు.  వైసీపీ హయాంలో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోను ముద్రించిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. మా పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటంటూ రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం ప్రభుత్వం   ప జగన్ బొమ్మను తొలగించి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలను ముద్రించి రైతులకు పంపిణీ చేస్తోంది. 

4న భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముస్తాబౌతోంది.  విమానాశ్రయ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ట్రయల్ రన్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు అధికారులు. వచ్చే నెల 4న తేదీన భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ లో భాగంగా తొలి విమానం ల్యాండ్ కానుంది.   ఫైనల్ టెస్ట్ రన్‌లో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం జనవరి 4న ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుంది.  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ   ఉన్నతాధికారులు ఆ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు.  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంతో జరగడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడి చొరవే కారణమని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇప్పటికే విమానాశ్రయం నిర్మాణ పనులు95 శాతానికి పైగా పూర్తయ్యాయి.  మిగిలిన పనులు కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.   ఈ నేపథ్యంలోనే  జనవరి 4న జరిగే  ఫైనల్  ట్రయల్ రన్  నిర్వహించనున్నారు. ఆ తరువాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇతర విమానయాన సంస్థలతో చర్చలు జరిపి.. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే తేదీని ఖరారు చేస్తారు.