తెలంగాణకు మరో మూడు రోజులు భారీ వర్ష సూచన.. హై అలర్ట్ ప్రకటించిన సర్కార్
posted on Jul 29, 2022 5:59AM
వరుణుడు తెలంగాణపై పగబట్టినట్టు కనిపిస్తున్నది. విరామం లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమైపోతోంది. గురువారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. అయితే హైదరాబాద్ ను మాత్రం భారీ వర్షం ముంచెత్తింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో ప్రబుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని పేర్కొంది. కాగా గురువారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి జనం నానా ఇక్కట్లూ పడ్డారు. పలు చెరువులు తెగి పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాదాపూర్, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, బండ్లగూడజాకీర్ ప్రాంతాలతో పాటు అత్తాపూర్, శివరాంపల్లిలో భారీ వర్షం కురిసింది.
కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. కాగా మూసారాంబాగ్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించడంతో ధ్వంసమైన వంతెనకు మరమ్మతు పనులు చేపట్టారు. వంతనె పైనుంచి రాకపోకలను నిలిపివేసి సంగతి విదితమే.