రెండు రాష్ట్రాల ఎన్నికలు ప్రశాంతం
posted on Jan 31, 2012 8:35AM
న్యూఢిల్లీ: పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల శాసనసభలకు సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈసారి ఎక్కువ శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. పంజాబ్‌లో సాయంత్రం ఐదు గంటల వరకు 70 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. పంజాబ్‌లో 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 75.36 శాతం, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 70.04 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లో ఒక 16 ఏళ్ల బాలుడు చనిపోగా, మరో పది మంది గాయపడ్డారు.ఉత్తరాఖండ్‌లో సాయంత్రం ఐదు గంటల వరకు 65 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే అప్పటికి ఇంకా చాలా మంది పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నందున పోలింగ్ 70 శాతానికి మించుతుందని అంచనా. ఉత్తరాఖండ్‌లో 2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 63.96 శాతం, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 53.96 శాతం పోలింగ్ నమోదయింది. పోలింగ్ శాతం పెరగడం తన ఘనతేనని ఎన్నికల సంఘం చెప్పుకుంది. ‘మెరుగైన ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలి’ అన్న ఎన్నికల సంఘం ప్రచారం వల్లే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైందని డిప్యూటి ఎలక్షన్ కమిషనర్ అలోక్ శుక్లా పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ మొత్తంమీద పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం తెలిపింది. పంజాబ్‌లో రూ. 12.13 కోట్లు, ఉత్తరాఖండ్‌లో రూ. 1.36 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మీడియాలో పెయిడ్ న్యూస్ కనిపించరాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కెండేయ్ కట్జూ మీడియా యాజమాన్యాలకు సూచించారు. రాజకీయ నాయకులు, వారి శ్రేయోభిలాషులు డబ్బులు చెల్లించి తమకనుకూలంగా మలుచుకునే ఇలాంటి వార్తలు ఓటర్లను ప్రలోభ పెట్టేలా ఉంటాయని పేర్కొన్న ఆయన..పెయిడ్ న్యూస్ ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని మిడియాలోని అన్ని స్థాయిల ప్రతినిధులను ఓ ప్రకటనలో హెచ్చరించారు.