చిరంజీవి ఇష్టపడ్డరనే: గంటా పై దేవినేని ఫైర్
posted on Jan 31, 2012 8:21AM
హైదరాబాద్: చిరంజీవి మోజుపడ్డారనే కృష్ణా జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువ చేసే ఐలాండ్ ద్వీపాన్ని మంత్రి గంటాకు చెందిన కంపెనీకి ప్రభుత్వం కట్టబెట్టే ప్రయత్నాల్లో ఉందని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినందుకు బహుమానంగా ఈ ద్వీపాన్ని ఇస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. మంత్రి అయి నెల తిరగకముందే కృష్ణా, విశాఖ జిల్లాలలో రెండు భూ కుంభకోణాల్లో గంటా బయటపడ్డాడని అయన విమర్శించారు."భవానీ ద్వీపంలో 1340 ఎకరాల భూమి ఉంది. టీడీపీ హయాంలో ఇందులో 24 కాటేజీలు, కాన్ఫరెన్సు హాలు, చెట్లపైన కాటేజీలు, బోట్లు వంటి అనేక సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుతం ఏడాదికి దీని టర్నోవర్ రూ.రెం డు కోట్లు కాగా అందులో రాష్ట్ర పర్యాటక సంస్థకు రూ.ఏభై లక్ష ల ఆదాయం వస్తోంది. ఇప్పటికే గణనీయంగా సౌకర్యాల అభివృద్ధి జరిగి మంచి ఆదాయం వస్తున్న దీనిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆయన అన్నారు.
రూ.వందల కోట్ల విలువైన ఈ ద్వీపాన్ని కేవలం రూ.60 కోట్లకు ఈ కంపెనీకి క ట్టబెడుతున్నారనిఅయన అన్నారు.వందల కోట్ల విలువ చేసే భవాని ఐలాండ్‌ను కేవలం అరవై కోట్లకే ఎలా అప్పగిస్తారంటూ ఆయన సీఎంను ప్రశ్నించారు. వెంటనే ఈ టెండర్‌ను నిలిపివేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కేటాయింపుపై గతంలో విమర్శలు చెలరేగినప్పుడు ఎవరికీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం లీక్ ఇచ్చిందని, కాని ఇటీవలి పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో ఈ ద్వీపానికి కూడా ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నట్లు చూపారని, దొడ్డిదారిన దీన్ని ఖరారు చేసే వ్యవహారం నడుస్తోందని అన్నారు. అధికారులు తొందరపడి ఈ వ్యవహారాన్ని ఆమోదిస్తే శ్రీలక్ష్మి, ఆచార్య మాదిరిగా జైల్లో కూర్చోవలసి వస్తుందని హెచ్చరించారు.