ఆసియా కప్ ఫైనల్ లో దాయాదుల ఢీ
posted on Sep 26, 2025 6:14AM
ఆసియాకప్ ఫైనల్ లో పాకిస్థాన్ భారత్ తలపడనున్నాయి. గురువారం (సెప్టెంబర్ 26) సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై 11 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఇప్పటి వరకూ పేలవ ప్రదర్శన చేస్తూ వచ్చిన పాకిస్థాన్ ఫైనల్ కు చేరాలంటే చావో రేవో లాంటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై చెమటోడ్చి గెలిచింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 11 పరుగుల ఆధిక్యతతో పాకిస్థాన్ గెలిచి.. ఫైనల్ కు చేరుకుంది.
ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ లో భారత్ తో తలపడనుంది. భారత్, పాకిస్థాన్ ల మధ్య ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 28) జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ లు తలపడటం ఇది మూడో సారి అవుతుంది. గ్రూప్ స్టేజిలో ఒకసారి, సూపర్ ఫోర్ స్టేజిలో రెండో సారి ఇరు జట్లూ తలపడ్డాయి. ఆ రెండు సార్లూ కూడా భారత్ సునాయాస విజయాలను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఒకవైపు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఈ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ను వరుసగా మూడోసారి ఓడించాలని చూస్తుంటే, మరోవైపు పాకిస్థాన్ గత ఓటములకు ప్రతీకారం తీర్చుకుని ఆసియా కప్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. టీమిండియా ఇప్పటివరకు 8 సార్లు ఆసియా కప్ టైటిల్ గెలుచుకోగా, పాకిస్థాన్ 2 సార్లు ఈ ట్రోఫీని కైవసం చేసుకుంది
ఆసియా కప్ 2025లో టీమిండియా ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ సాధికార విజయాలతో జోరుమీద ఉంది. పాకిస్థాన్ అయితే మూడు మ్యాచ్ లలో విజయం సాధించి రెండింటిలో పరాజయం పాలయ్యింది.