పాకిస్తాన్‌లో భారతీయ జెండా ఎగిరితే!
posted on Jan 27, 2016 @ 3:51PM
భారతదేశంలో పాకిస్తాన్ జెండా రెపరెపలాడటం కొత్తేమీ కాదు. కశ్మీర్‌లోని వేర్పాటవాదులు నిత్యం ఈ పని చేస్తూనే ఉంటారు. వాటిని మన దేశ అధికారులు చూసీ చూడనట్లు వదిలేయాల్సిన పరిస్థితి అక్కడిది. కానీ నిన్న ఓ పాకిస్తాన్ జాతీయుడికి తన దేశంలో భారతీయ జెండాని ఎగురవేస్తే ఏం జరుగుతుందో తెలిసి వచ్చింది. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని ఒకారా జిల్లాలో నివసించే ‘ఉమర్ ద్రాజ్’కి విరాట్ కోహ్లీ అంటే వెర్రి అభిమానం. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన 20-20 క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగిపోవడంతో కోహ్లీ మీద అభిమానంతో తన ఇంటి మీద భారతీయ జెండాను ఎగురవేశాడు. అదే అక్కడి పోలీసుల దృష్టిలో తీవ్ర నేరమైపోయింది. వెంటనే ఉమర్‌ని అరెస్టు చేశారు. దేశంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ అతడి మీద నేరాన్ని మోపారు. అందులోనూ నిన్న భారతీయ గణతంత్ర దినోత్సవం కావడంతో ఉమర్ చర్యని అధికారులు చాలా తీవ్రంగా పరిగణించారని తెలుస్తోంది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఉమర్ ఇంటిని సోదా చేసిన పోలీసులకు అతని గది నిండా విరాట్ కోహ్లీ పోస్టర్లు మాత్రమే కనిపించాయి. మరి పిచ్చివాడనుకుని వదిలేస్తారో లేకపోతే పొరుగు దేశం మీద ప్రేమ పెంచుకున్న పాపానికి దండిస్తారో వేచి చూడాలి!