అనుపమ్ ఖేర్‌కి అవార్డు అందుకేనా!
posted on Jan 27, 2016 @ 4:29PM
‘ఈ అవార్డులన్నీ ఒక బూటకం! వాటిలో ఎలాంటి విశ్వసనీయతా లేదు. పద్మా పురస్కారాలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు’ అంటూ 2010లో అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్‌లో విమర్శించారు. ఇప్పడు అదే అనుపమ్ ఖేర్ 'పద్మభూషణ్ అవార్డు అభించడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టం'గా పేర్కొన్నారు. అనుపమ్ గతంలో తను పద్మ పురస్కారాల గురించి చేసిన విమర్శను మర్చిపోయినా జనాలు మర్చిపోయినట్లు లేదు. సోషల్ మీడియాలో ఇప్పడు అనుపమ్ మీద తీవ్రమైన విమర్శలను గుప్పిస్తున్నారు విమర్శకులు. కశ్మీరి పండిట్లకు చెందిన అనుపమ్ ఖేర్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారడం వల్లే ఈ అవార్డు వచ్చిందంటున్నారు. దేశంలో పెరిగిపోతున్న అసహనం మీద చర్చ సందర్భంగా బాలీవుడ్ తరఫున అనుపమ్ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతుని ప్రకటించాడు. అవార్డులను వెనక్కి ఇచ్చి దేశం పరువు తీయవద్దంటూ ర్యాలీని సైతం నిర్వహించాడు. అసహనం గురించి అమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలను చేసినప్పుడు అతని మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. మరో పక్క అనుపమ్ ఖేర్ భార్య అయిన కిరణ్ ఖేర్ భాజపా తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదనీ, ఆపత్కాలంలో బాలీవుడ్ తరఫున తమకు అండగా ఉన్నందుకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపే ఈ పద్మభూషణ్ అనీ అంటున్నారు విమర్శకులు. అనుపమ్ మాత్రం సినీరంగంలో ఇన్నాళ్లపాటు తాను చేసిన కృషి ఫలితంగానే ఈ అవార్డు దక్కిందని వాదిస్తున్నారు. వీరిలో ఎవరి మాట నిజమన్నది మాత్రం తెలిసే అవకాశం మనకి లేదు!