జగన్ ఎపీయన్జీవోలతో సయోధ్య కోరితే

 

ఇంతవరకు వైకాపా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమాలు ఆశించినంత స్థాయిలో ప్రజలపై ప్రభావం చూపలేకపోయాయని ఇటీవల షర్మిల పార్టీ అంతర్గత సమావేశంలో అన్నట్లు సమాచారం. సమైక్య ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్నికలిపి ఉంచాలనే ఆశయం కంటే, ఆ ఉద్యమాల ద్వారా తమ పార్టీని సీమాంద్రాలో బలపరుచుకోవాలనే ఆత్రమే వారిలో ఎక్కువ కనిపిస్తోంది. చివరికి ఆ పార్టీ నేతలు, అధ్యక్షుడితో సహా అందరూ తమ పదవులకు రాజీనామాలు చేసినా కూడా ప్రజలు, ఉద్యోగులు కూడా నమ్మడం లేదు. అందుకే వారు ఇంతకాలం వైకాపాను దూరం పెడుతున్నారు. అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడుదలతో ఆ పరిస్థితి మారే అవకాశం ఉంది.

 

రానున్న ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో వైకాపా గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీబీఐ కష్టాలు మొదలవుతాయి. గనుక గెలుపే లక్ష్యంగా అతను ముందుకు సాగనున్నాడు. ప్రస్తుతం అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమాలతో పార్టీని ప్రజలకు మరింత చేరువచేసేలా అతను వ్యూహాలు రచించవచ్చును.

 

ఇంతవరకు ఏపీయన్జీవోలు, ప్రజలు సమైక్యాంధ్ర కోసం చేస్తున్న నిరవధిక సమ్మె, ఉద్యమాలను జగన్మోహన్ రెడ్డి తన చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేసినప్పుడు, ఉద్యోగులలో చీలికలు ఏర్పడినట్లయితే, అది ఘర్షణ వాతావరణానికి దారి తీయవచ్చును. అయితే సీమాంద్రాకే పరిమితమయిన వైకాపా రానున్న ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికారం చేపట్టాలంటే ఏపీయన్జీవోల సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది గనుక వారిని దూరం చేసుకొనే సాహసం చేయకపోవచ్చును.

 

ఇంతవరకు వైకాపా వారికి దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ, త్వరలో జగన్మోహన్ రెడ్డి మరోమారు గట్టి ప్రయత్నమే చేయవచ్చును. ఇక రెండు నెలలుగా అవిశ్రాంత పోరాటం చేసి అలిసున్నఏపీయన్జీవోలు కూడా జగన్ సరయిన రీతిలో ముందుకు వస్తే వారు కూడా అతనిని ఆదరించే అవకాశాలున్నాయి. ఇంతవరకు ఏపీయన్జీవోలు తమ నిరవధిక సమ్మెతో రాష్ట్రవిభజనను నిలువరించగలుగుతున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానాన్ని తన నిర్ణయం వెనక్కు తీసుకోనేలా మాత్రం ఒప్పించలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా వారికి అండగా నిలబడేందుకు ముందుకు వచ్చినట్లయితే వారు అతనిని ఆహ్వానించినా ఆశ్చర్యం లేదు.

 

ఒకవేళ తమ పోరాటం విఫలమయ్యి రాష్ట్ర విభజన జరిగి, వైకాపా అధికారంలోకి వచ్చేఅవకాశాలున్నట్లు వారు భావిస్తే, అతనికి మద్దతు నీయడం ద్వారా వారి ఉద్యోగ ప్రయోజనాలు కూడా నెరవేరే అవకాశం ఉంది, గనుక వారు వైకాపాను ఉద్యమంలోకి ఆహ్వానించవచ్చును. అయితే, వైకాపా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు లేదా మద్దతుకు అంగీకరించబోదని జగన్ ముందుగా వారికి హామీ ఈయవలసి ఉంటుంది.

 

ఒకవేళ వారి మధ్య సయోధ్య కుదిరినట్లయితే, ఇది కాంగ్రెస్, తెదేపాలకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది.