నరాలు తెగే ఉత్కంఠ.. విజయం దోబూచులాట- పాక్ తో మ్యాచ్ లో భారత్ పరాజయం
posted on Sep 5, 2022 5:35AM
నరాలు తెగే ఉత్కంఠం.. చివరి బంతి వరకూ విజయం దోబూచులాట.. ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ జరిగిన తీరిది. ఇరు జట్ల మధ్యా వారం వ్యవధిలో రెండో సారి మ్యాచ్ జరిగింది. ఆఖరి ఓవర్‌లో మరో బంతి మిగిలి ఉండగాయం పాక్ ను వరించింది. భారత బౌలర్ల వైఫల్యం, ఫీల్డింగ్ లోపాలే భారత్ ను దెబ్బ తీశాయి. ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లో పరాజయానికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. భారీ లక్ష్య ఛేదనలో సైతం ఎలాంటి ఒత్తిడీ లేకుండా స్వేచ్ఛగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది.
182 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కింగ్ కోహ్లీ పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకుని క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. కవర్ డ్రైవ్స్, ఫ్లిక్ షాట్లతో అలరించడమే కాకుండా వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ పరుగులు రాబట్టాడు. అద్భుత హాఫ్ సెంచరీతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కొలాప్స్ కాకుండా అడ్డుకున్నాడు. ఓపెనర్లు రోహిత్, రాహుల్ శుభారంభాన్ని ఇచ్చినా, మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చడంలో విఫలమయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ల నుంచి మెరుపు ఆరంభం లభించింది.
పిచ్‌పై బంతి పేస్, బౌన్స్ అవుతున్నా ఈ జోడీ పాక్ పేసర్లను ఆటాడుకుంది. దాదాపు చివరి వరకు కోహ్లీ క్రీజులో ఉండి భారీ స్కోరుకు ప్రయత్నించాడు. ఇక పేసర్ నసీమ్ షాను లక్ష్యం చేసుకున్న ఓపెనర్లు పరుగుల వరద పారించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో రోహిత్ 4,6తో 11 రన్స్ రాబట్టగా.. అతడి రెండో ఓవర్‌లో రాహుల్ 6,6తో 14 రన్స్ సాధించాడు. అలాగే హారిస్ రౌఫ్ ఓవర్‌లో రోహిత్ రెండు వరుస సిక్సర్లతో చెలరేగడంతో రన్‌రేట్ పదితో దూసుకెళ్లింది. అయితే ఆరో ఓవర్‌లో రోహిత్ అతడికే చిక్కాడు. తొలి బంతిని లాఫ్టెడ్ డ్రైవ్‌కు ప్రయత్నించగా, కవర్‌లో ఖుష్‌దిల్ క్యాచ్ పట్టేశాడు. దీంతో తొలి వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఈ దశలో పుంజుకున్న పాక్ బౌలర్లు రాహుల్‌తో పాటు సూర్యకుమార్ (13)ను కూడా స్వల్ప వ్యవధిలోనే వెనక్కి పంపారు. దీంతో కోహ్లీ, పంత్ కాస్త జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. నసీమ్ షా తన రెండో స్పెల్‌లో కోహ్లీ, పంత్ (14) ఫోర్లతో 13 రన్స్ ఇచ్చుకోవడంతో స్కోరు బోర్డులో కాస్త కదలిక కనిపించింది. అయితే స్పిన్నర్ షాదాబ్ గూగ్లీకి పంత్ స్లాగ్ స్వీప్ ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక తొలి మ్యాచ్‌లో జట్టుకు సిక్సర్‌తో విజయాన్నందించిన హార్దిక్ డకౌట్ అయ్యాడు. 18వ ఓవర్‌లో హుడా (16) 4, కోహ్లీ సిక్సర్‌తో 16 రన్స్ వచ్చాయి. అలాగే కోహ్లీ 36 బంతుల్లో వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. షాదాబ్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచింది. మహ్మద్ రిజ్వాన్ (71), నవాజ్ (42) ఆదుకున్నారు.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నవాజ్ నిలిచాడు. రిజ్వాన్ అండగా..:ఛేదనలో పాక్‌కు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ శుభారంభం దక్కలేదు. కెప్టెన్ బాబర్ (14) మరోసారి విఫలం కాగా.. ఫఖర్ జమాన్ (15) కూడా నిరాశపరిచాడు. అయితే రిజ్వాన్ ఎప్పటిలాగే ఆదుకునే ప్రయత్నం చేశాడు. పవర్‌ప్లేలో 44 పరుగులే చేసినా ఆ తర్వాతే పాక్ చెలరేగింది. హార్దిక్, చాహల్ ఓవర్లలో ధారాళంగా పరుగులు వచ్చాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా ముందుగా వచ్చిన మహ్మద్ నవాజ్ భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ రిజ్వాన్‌కు సహకరించాడు. ఈ జోరులో రిజ్వాన్ 37 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇక 14వ ఓవర్‌లో.. 15వ ఓవర్‌లో రెండేసి ఫోర్లు బాదిన నవాజ్ కూడా హఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ భువనేశ్వర్ అతడిని అవుట్ చేయడంతో ఈ ప్రమాదకర జోడీకి బ్రేక్ పడింది. ఆ వెంటనే హార్దిక్ ఓవర్‌లో రిజ్వాన్ అవుట్ కావడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. అప్పటికి పాక్ విజయానికి 19 బాల్స్‌లో 35 రన్స్ దూరంలో ఉంది.
అయితే 18వ ఓవర్‌లో బిష్ణోయ్ మూడు వైడ్లు వేయగా.. ఆసిఫ్ ఆలీ (16) ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అర్ష్‌దీప్ వదిలేయడం దెబ్బతీసింది. 19వ ఓవర్‌లో తను 6,4 బాదగా ఖుష్‌దిల్ (14 నాటౌట్) మరో ఫోర్‌తో భువీ 19 రన్స్ సమర్పించుకున్నాడు. ఇక చివరి ఓవర్‌లో కావాల్సిన ఏడు పరుగుల కోసం పాక్ ఆసిఫ్ వికెట్ కోల్పోయినా మరో బంతి ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.