ఇక సెప్టెంబర్ 17పై తెరాస, బీజేపీ రాజకీయం
posted on Sep 4, 2022 @ 6:17PM
మహాకవి శ్రీశ్రీ కాదేదీ కవితకనర్హం అన్నారు. అయితే నేడు రాజకీయ నాయకులు, పార్టీలూ మాత్రం కాదేదీ రాజకీయానికనర్హం అంటున్నారు. కులం, మతం, వర్గం, ప్రాంతం, చివరకు చారిత్రక ఘట్టాలను సైతం రాజకీయం కోసం వాడేసుకుంటున్నారు. ఇష్టారీతిగా భాష్యాలు చెప్పేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ, అధికార తెరాసలు ఈ విషయంలో ఒకదానిని మించి ఒకటి పోటీలు పడుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను సైతం బీజేపీ, తెరాసలు వేర్వేరుగా నిర్వహించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. కేంద్రం ఆజాదీ కా అమృతోత్సవ్ అంటే స్వాతంత్ర్య వజ్రోత్సవాలు అంటూ తెరాస పోటీగా వేరేగా ఏర్పాట్లు చేసి నిర్వహించింది.
ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడానికి యోచిస్తుండగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సెప్టెంబర్ 17ను తెలంగాణ దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినంగా నిర్వహించాలని నిర్ణయించారు. దేశానికి స్వతంత్రం సిద్ధించిన సమయంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కాలేదు. ఆ తరువాత నిజాంపై సైనిక చర్యకు దిగి మిగిలిన పని పూర్తి చేశారు. భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమై ఈ సెప్టెంబరు 17నాటికి 74 ఏళ్లు పూర్తై. 75వ సంవత్సరం వస్తుంది.
అందుకే తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని భావిస్తున్నారు. సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ఏనాటి నుంచో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని టీఆర్ఎస్ హామీ కూడా ఇచ్చింది. అయితే రాష్ట్రం ఆవిర్భవించి, తెరాస అధికార పగ్గాలు చేపట్టినా కూడా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం హామీని మాత్రం అమలు చేయలేదు. ఈ ఎనిమిదేళ్లుగా బీజేపీ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చింది కానీ ఇప్పటిలా కేంద్రమే అధికారికంగా నిర్వహించాలని తలచలేదు.
ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏడాదిపాటు తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయించేశారు. అజాదీకా అమృత్ మహోత్సవ్‌ను కేంద్రంతో సంబంధం లేకుండా వేరేగా పోటీగా చేసిన కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ విలీన దినోత్సవాన్ని కూడా అలాగే నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర సాంస్కృతిక, హోం మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనుండగా, తెలంగాణ సర్కార్ విడిగా తన ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించనుంది.
కేంద్రం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాలను అమిత్ షా హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై, ఏక్‌నాథ్ షిండే హాజరవుతారు. నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన జిల్లాలు కూడా ఉండేవి. దాంతో కేంద్రం నిర్వహించే విమోచన దినోత్సవాల్లో వారిని కూడా భాగస్వాములను చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ఉత్సవాలకు హాజరయ్యే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ ఈ విమోచన దినోత్సవాన్ని వేరుగా సొంతంగా జాతీయ సమైక్య దినోత్సవంగా నిర్వహిస్తోంది. మొత్తానికి తెలంచన దినోత్సవాన్ని కూడా ఒక రాజకీయ కార్యక్రమంగా, తమ రాజకీయ లబ్ధికి ఒక సోపానంగా బీజేపీ, తెరాస లు వాడేసుకుంటున్నాయి.