వైసీపీ కోసం 300 వందలకు పైగా యూట్యూబ్ చానెళ్లు!
posted on Jun 29, 2023 9:11AM
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఇప్పుడు జాకీలేసి లేపే సోషల్ మీడియా వింగ్ అర్జెంటుగా కావాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులకు తోడు కొన్ని సోకాల్డ్ డిజిటల్ మీడియా చానెళ్లు సైతం ఇప్పటికే జై జగన్ అంటూ స్లోగన్లు ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఈ నాలుగేళ్లుగా అదే పని చేస్తుండడంతో వీటిని జనాలు పట్టించుకోవడం మానేశారు. ఫలానా సంస్థ యూట్యూబ్ ఛానెల్ లో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వీడియో వచ్చింది అంటే కొత్తేముందిలే అంటూ ప్రజలు కూడా దాన్ని చూసేందుకు సిద్ధంగా లేరు. నాలుగేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న అస్తవ్యస్థ నిర్ణయాలు, ముందు చూపు లేని జీవోలకు తోడు రంగుల మార్పు, పేర్లు మార్పు, తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై కేసులు పెట్టడం ఇలా ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో బిగ్ డ్యామేజీ జరిగిపోయింది.
మరోవైపు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఎండగట్టే పని మొదలు పెట్టడంతో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఒకవైపు నాలుగేళ్లుగా జరిగిన డ్యామేజ్, ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలు వెరసి జగన్ ప్రభుత్వానికి తలబొప్పి కడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా డిజిటల్ మీడియాను వాడుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మూడు వందలకు పైగా యూట్యూబ్ ఛానెళ్లతో తన ప్రభుత్వ సంక్షేమం గురించి ప్రచారం చేయించాలని వైసీపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఇందు కోసం ఎక్కడిక్కడ భారీ సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్న వ్యక్తిగత చానెళ్లు, వివిధ జిల్లాలలో నడుస్తున్న యూట్యూబ్ మీడియా ఛానెళ్లను తనవైపుకు తిప్పుకొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది.
ఇప్పటి వరకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తిగత ఛానెళ్లతో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య సంక్షేమంలో వ్యత్యాసాలను వివరించేలా వీడియోలతో ప్రమోట్ చేసేందుకు వారితో సంప్రదింపులు మొదలు పెట్టిన వైసీపీ.. పలు యూట్యూబ్ మీడియా ఛానెళ్లను గంపగుత్తగా కోనేసేందుకు కూడా సిద్దమైనట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే గత నెల రోజులలో సుమారు 30 యూట్యూబ్ చానెళ్లు వైసీపీకి అనుకూలంగా మారిపోయి చాప కింద నీరులా జగన్ భజన చేయడం మొదలు పెట్టాయి. ఇవన్నీ వ్యక్తిగత చానెళ్లే అయినా వైసీపీ కార్యక్రమాలను ప్రోత్సహించడం కొన్ని చానెళ్లు చేస్తుంటే.. మరికొన్ని వ్యూహాత్మకంగా వైసీపీని ప్రమోట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాయి. మరో మూడు నెలలలోగా మొత్తం మూడు వందల పైగా ఛానెళ్లతో ఈ తతంగం మొదలు పెట్టాలని చూస్తున్నారు.
వైసీపీకి రాజకీయ వ్యూహ రచన చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ ఇలా డిజిటల్ మీడియాను వాడుకోవడంలో దిట్ట అనే సంగతి తెలిసిందే. అయితే, గత ఎన్నికల హయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన చానెళ్లు, వైసీపీని ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయాయి. ఇవన్నీ వైసీపీ సానుభూతిపరులతోనే నిండిపోగా వాటితో సామాన్య ప్రజలను మేనేజ్ చేసే పరిస్థితి లేదు. అందుకే కొద్దిరోజులుగా వైసీపీ డిజిటల్ వింగ్ పాత వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చింది. కానీ, వైసీపీకి నాలుగేళ్ళలో జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు అవి ఏ మాత్రం సరిపోవు. అందుకే ఇప్పుడు ఇలా వ్యక్తిగత చానెళ్లు, మీడియా ఛానెళ్లను అరువు తెచ్చుకుంటున్నారు. అన్నట్లు ఈ ప్రచారం కోసం వైసీపీ కోట్ల రూపాయలను వెదజల్లేందుకు కూడా సిద్దమైనట్లు తెలుస్తుంది.