అన్‌లైన్‌లో ఆరోగ్య సలహాలు అనర్థమా!
posted on Apr 6, 2021 @ 9:30AM
ఇప్పుడు ఇంటర్నెట్ వాడని వారు అరుదుగా కనిపిస్తారు. అందులోనూ, ఇంటర్నెట్‌లో ఆరోగ్యం గురించి కనిపించే వ్యాసాలంటే అందరికీ ఆసక్తే! రోగం వచ్చిన వెంటనే వైద్యుడికంటే ఇంటర్నెట్‌నే సంప్రదించేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కానీ ఈ ఇంటర్నెట్‌లో లభించే ఆరోగ్య సూచనలు ఎంతవరకు శాస్త్రీయం అంటే మాత్రం తెల్లమొగం వేయవలసి వస్తోంది.
ఓ కెనడా పరిశోధన
కెనడాలో ఈ మధ్య కొందరు పరిశోధకులు ఇంటర్నెట్‌లో అల్జీమర్స్ వ్యాధి గురించి ఉన్న సమాచారాన్ని పరిశీలించారు. తమ పరిశోధనలో తేలిన విషయాలు చూసి, వారే కంగారుపడాల్సి వచ్చింది. అల్జీమర్స్ గురించి తాము చదివిన 300 వ్యాసాలలో నిరుపయోగమైన, తప్పుదారి పట్టించే సమాచారమే ఎక్కువగా ఉందట. పైగా వాటిలో దాదాపు ఐదో వంతు వెబ్‌సైట్లు ఏదో ఒక ఉత్పత్తిని ప్రచారం చేసేందుకే ప్రాధాన్యతని ఇచ్చాయట. సదరు ఉత్పత్తులను వాడితే అల్జీమర్స్ నయమైపోతుందనీ, అలా నయమవుతుందన్న హామీ ఇస్తామనీ సదరు వెబ్‌సైట్లు ఊదరగొట్టేశాయి. కెనడాలోని దాదాపు 80 శాతం మంది అల్జీమర్స్ రోగులు ఇలాంటి సమాచారం మీద ఆధారపడే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే రోగులలో ఇలాంటి సమాచారం లేనిపోని ఆశలను కల్పిస్తుంది. ఫలితంగా తమ వ్యక్తిగత వైద్యుల సలహాలను పెడచెవిన పెట్టి ఈ ఉత్పత్తులను వాడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. తప్పుడు సమాచారం, పనికిమాలిన ఉత్పత్తుల వల్ల రోగులకు తమ వ్యాధి నుంచి ఉపశమనం కలుగకపోగా... ఆరోగ్యమూ, డబ్బూ చేజారిపోయే ప్రమాదమే ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో అనర్థాలు
ఆన్‌లైన్‌లో ఆరోగ్య సమాచారం, ఉత్పత్తుల సంగతి అలా ఉంటే... ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇచ్చేవారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే నేరుగా ఒక వైద్యుని సంప్రదించినప్పుడు చేసే రోగ నిర్ధరణకీ, ఆన్‌లైన్‌లో పారేసే సలహాకీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. మన అలవాట్లు, గతంలో తీసుకున్న చికిత్సలు, శరీర నిర్మాణం, వంశపారంపర్య వ్యాధులు, ఇతరత్రా సమస్యలు, రక్తపోటు వంటి అనారోగ్యాలు... ఇన్నింటిని దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే తగిన పరీక్షలను నిర్వహించి వైద్యలు ఒక సలహాను కానీ చికిత్సా విధానాన్ని కానీ సూచిస్తారు. ఎలాంటి వ్యక్తిగత పర్యవేక్షణా లేకుండా ఈ ఉత్పత్తి వాడితే మీరు సన్నబడిపోతారనో, ఈ తిండి తింటే మీ రక్తపోటు మాయం అయిపోతుందనో చెప్పే సలహాలు ఒకోసారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. అందులోనూ వ్యాపార ధోరణితో ఇచ్చే సలహాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
గూగుల్‌లో వెతికితే దొరకని విజ్ఞానమంటూ ఉండకపోవచ్చు. కానీ అది ఓ ప్రవాహం అనీ... దానికి అడ్డూ అదుపూ, మంచీచెడూ విచక్షణ తక్కువగా ఉంటుందని తెలిసిన రోజున ఎటువంటి సమాచారాన్నైనా ఆచితూచి ఉపయోగించుకునే విచక్షణ కలుగుతుంది. లేకపోతే ఆ ప్రవాహంతో పాటే మనమూ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.
- నిర్జర.