మంచితనమే శ్రీరామరక్ష

 

‘మన మంచితనమే మనల్ని కాపాడుతుంది’ అని తరచూ పెద్దలు చెప్పే మాటల్ని మనం కొ్ట్టిపారేస్తూ ఉంటాము. కొన్నాళ్ల క్రితం వరకూ వారంతా హాయిగా పాటించిన విలువలని చాదస్తాలుగా తీసిపారేస్తూ ఉంటాము. కానీ నలుగురితో మంచిగా నడుచుకోవడం మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని తేల్చిచెబుతున్నాయి అనేక పరిశోధనలు. వాటిలో కొన్ని...

 

ఒత్తిడి నుంచి ఉపశమనం

గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు నిపుణులు ఒక పరిశోధనను నిర్వహించారు. ఇందుకోసం వారు 77 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. ఇతరులకు ఏవన్నా సాయం చేసినప్పుడు, మనలోని ఒత్తిడిలో ఏమన్నా మార్పులు వస్తాయా అన్న దిశగా అభ్యర్థలు జీవితాలను పరిశీలించారు. సాయం అనగానే ఏవో భారీ త్యాగాలు అనుకునేరు! అవతలివారి కోసం తలుపు తెరిచి పట్టుకోవడం, ఎవరన్నా దారి చెప్పమంటే సరైన సూచనలు ఇవ్వడం... ఇలా మనం రోజువారీ చేయగలిగే చిన్నపాటి సాయాలే! ఆశ్చర్యం ఏమిటంటే, ఇలాంటి సాయాలు చేసిన రోజులలో వారిలో సానుకూల దృక్పథం పెరిగి ఒత్తిడిని సునాయాసంగా ఎదుర్కోగలిగారట! ఒత్తిడిని ఎదుర్కోవాలంటే నలుగురితోనూ మంచిగా ఉండేందుకు ప్రయత్నించి చూడమంటున్నారు పరిశోధకులు.

 

సంతోషాల స్థాయి పెరుగుతుంది

2008లో హావర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కి చెందిన కొందరు పరిశోధకులు, సైన్స్‌ అనే పత్రికలో ఓ వ్యాసాన్ని రాశారు. తమ దగ్గర ఉన్న డబ్బుని ఇతరుల కోసం ఖర్చుపెడితే, మనలో సంతోషపు స్థాయిలో ఏమన్నా మార్పు వస్తుందా అన్న కోణంలో వీరు ఒక పరిశోధనను నిర్వహించారట. ఇందులో భాగంగా వీరు కొందరు విద్యార్థులకి తలా కొంత డబ్బుని అందించారు. ఈ డబ్బుని తమ కోసం కానీ, ఇతరుల కోసం కానీ ఖర్చుపెట్టుకోవచ్చునని సూచించారు. ఏ విద్యార్థులైతే ఇతరుల కోసం డబ్బుని ఖర్చుపెట్టారో, వారిలో సంతోషపు స్థాయి కూడా గణనీయంగా పెరగడాన్ని గమనించారు.
గుండెతీరు మెరుగుపడుతుంది

 

సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తుల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. వీరిలో రక్తపోటు కానీ, గుండెవేగం కానీ సాధారణంగా ఉంటాయనీ... గుండెధమనుల మీద ఉండే ఒత్తిడి అదుపులో ఉంటుందనీ తేలింది. తమ మీద తమకు నమ్మకం పెరుగుతుందనీ... ఒత్తిడీ, క్రుంగుబాటు వంటి వ్యతిరేక ధోరణులు తగ్గుముఖం పడతాయనీ వెల్లడయ్యింది.

 

నలుగురితో మంచిగా ఉండటానికీ ఆరోగ్యానికీ సంబంధం ఏమిటన్న ప్రశ్న ఎవరిలోనైనా మెదలవచ్చు. దీనికి జవాబు ఏమంత కష్టం కాదేమో! మనిషి సంఘజీవి. తనకు ఇతరుల అవసరం ఉందని గుర్తించిననాడు, తాను కూడా ఇతరులకు చేతనైనంత సాయం చేస్తాడు. ఇతరులకు చేసే మేలు అంతిమంగా తనకే ఉపయోగపడుతుందన్న విషయం అతనిలో ఏదో ఒక మూలన స్ఫురిస్తూనే ఉంటుంది. అందుకనే ఇతరులకు సాయం చేసినప్పుడూ, ఆప్తులను ఆదుకున్నప్పుడూ... తన జీవితం సార్థకం అయ్యిందన్న తృప్తి అతనికి లభిస్తుంది. ఒంటరితనంలో అతన్ని దిగులు మాత్రమే ఆవరిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలన్నా, బాధను తగ్గించుకోవాలన్నా మనిషి చుట్టూ నలుగురు ఉండాల్సిందే! ఆ నలుగురితో మంచిగా బతకాల్సిందే!

 

- నిర్జర.