ఒం‘గోల్’మాల్!
posted on Nov 8, 2013 @ 2:10PM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒంగోలు రాజధాని అయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఒంగోలు కొత్త రాజధాని అయ్యే అవకాశాలు గోల్‌మాల్ అయిపోయినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఒంగోలు పరిసరాల్లో చాలా విస్తారంగా ప్రభుత్వ స్థలాలు వుండటం, కొత్త రాజధాని ఏర్పడాలంటే ప్రభుత్వ స్థలాల అవసరం చాలా వుండటం, ఇటు కోస్తాంధ్రకు, అటు రాయలసీమకు రాజధానికి సంబంధించిన అనుసంధానం బాగా వుండాలంటే రాజధానిగా ఒంగోలు కరెక్ట్ అనే అభిప్రాయాలు గతంలో వినిపించాయి. ఒంగోలు రాజధాని కాబోతోందన్న ఊహాగానాలతో ఒంగోలులో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒంగోలు పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూముల గురించి ఆరా తీయడం, ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి ఫెన్సింగ్స్ నిర్మించడం చూసి ఇక ఒంగోలు రాజధాని అయిపోవడం ఖాయమని అనుకున్నారు.
అయితే ఇప్పుడు ఆ ఆశలు, అంచనాలు అన్నీ అడుగంటిపోయాయి. సీమాంధ్ర నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, పార్లమెంటు సభ్యులు విజయవాడ-గుంటూరు మధ్యలో కొత్త రాజధాని వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు కూడా చేస్తున్నారు. ఈ రెండు జంట నగరాల మధ్య రాజధాని ఏర్పడితో కోస్తాంధ్రతోపాటు ఇటు ఉత్తరాంధ్ర, అటు రాయలసీమ ప్రజలకు కూడా అనుకూలంగా వుంటుందని చెబుతున్నారు. విశాఖపట్నం రాజధాని అవ్వాలని ఉత్తరాంధ్ర వాసులకు, గతంలో కర్నూలును త్యాగం చేశాం కాబట్టి కొత్త రాజధాని రాయలసీమలోనే ఉండాలని రాయలసీమ వాసులు కోరుకుంటున్నప్పటికీ మెజారిటీ అభిప్రాయం విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని వుండాలని వినిపిస్తోంది.
పాపం రాజధాని హోదా వస్తుందని ఆశలు పెట్టుకున్న ఒంగోలు మాత్రం తనను పట్టించుకునేవారే లేకపోవడంతో రాజధాని రేసు నుంచి తప్పుకునే స్థితికి వచ్చేసింది. ఒంగోలు ప్రాంతంతో సంబంధం వున్న దగ్గుబాటి పురంద్రేశ్వరి, పనబాక లక్ష్మి, జేడీ శీలం కూడా ఒంగోలు గురించి మాట్లాడటం లేదు. అందరి గోల్ విజయవాడ-గుంటూరు మధ్యే ఉన్నప్పుడు ఒంగోల్ గోల్‌మాల్ కాక మరేమవుతుంది?