ఒకే కంపెనీకి ఇసుక టెండర్లు.. క్విడ్ ప్రోకో డీలేనా?
posted on Mar 21, 2021 @ 2:38PM
ఆంధ్రప్రదేశ్ లో లభ్యమయ్యే ఇసుకంతా ప్రైవేట్ సంస్థ పరమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇసుక రీచులను ఒకే కంపెనీకి అప్పగించారు. నూతన ఇసుక విధానంలో భాగంగా ప్రైవేటు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు స్వీకరించిన ప్రభుత్వం...అందులో ఎల్-1గా వచ్చిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు కాంట్రాక్టును అప్పగించింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలు ఒకటిగా, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు ఒక జోన్‌గా, రాయలసీమ, ప్రకాశం జిల్లాలు ఒక జోన్‌గా టెండర్లు పిలవగా.. మూడు జోన్లలోనూ ఆ సంస్థ ముందు నిలిచింది. దీంతో జయప్రకాశ్ పవర్ వెంచర్‌తో గనుల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఇసుక తవ్వకం, సరఫరా పనులన్నీ చేస్తుంది. ఇప్పటి వరకు ఇసుక తవ్వకం, అమ్మకాలు నిర్వహించిన ఏపీఎండీసీ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటుంది. ఈ కంపెనీ రెండేళ్లకుగాను మొదటి జోన్‌కు రూ.477.50 కోట్లు, రెండో జోన్‌కు రూ.745.70 కోట్లు, మూడో జోన్‌కు రూ.305.60 కోట్లను కోట్ చేసింది. అదే అధిక మొత్తం కావడంతో టెండర్లను నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ఆ మేరకు ఖరారుచేసింది.
రాష్ట్రంలో అన్ని ఇసుక టెండర్లను ఒకే కంపెనీకి కట్టబెట్టడంపై ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనుభవంలేని సంస్థకు ఇసుక రీచ్‌ను కేటాయించారన్నారు. ఎటువంటి అనుభవంలేని, నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు ఎందుకిచ్చారంటే..ఇందులో క్విడ్ ప్రోకో స్పష్టంగా కనబడుతోందన్నారు పట్టాభీ. క్విడ్ ప్రోకో జరుగుతోందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. ఇసుకను దోచుకోవడానికి సీఎం జగన్ నాటకాలాడుతున్నారని పట్టాభిరామ్ విమర్శించారు.
రాష్ట్రానికి నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలను మాత్రమే జగన్ రెడ్డి తీసుకువస్తారని పట్టాభీ ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమను నష్టాల్లో కూరుకుపోయిన ఒక లిబర్టీ స్టీల్ గ్రూపుకు కట్టబెట్టారని విమర్శించారు. వైసీపీ సర్కార్ నిర్వాకం కారణంగా ఇసుక రీచ్‌లు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నాయని, ఏడాదికి రూ.3,500 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని తెలిపారు.