బోగస్ ఓట్లు.. నోట్లే గెలిపించాయా!
posted on Mar 21, 2021 @ 2:54PM
తెలంగాణలో రాజకీయ కాక రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అధికార పార్టీ విజయం సాధించింది. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. నిరుద్యోగులు, ఉద్యోగులు టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వరని అంతా భావించారు. టీఆర్ఎస్ కనీస పోటీ ఇవ్వదనే చర్చ కూడా జరిగింది. ఓడిపోతామనే భయంతో అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. నల్గొండ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి తిరిగి పోటీ చేసేందుకు ఇష్టపడకపోయినా.. బలవంతంగా అతన్ని పోటీలో ఉంచారని కూడా చెప్పారు. ఇక హైదరాబాద్ స్థానంలో అభ్యర్థులు లేకపోవడంతో టీఆర్ఎస్ పోటీ చేయడం లేదని కూడా ప్రచారం జరిగింది. అయితే నామినేషన్లకు మూడు రోజుల ముందు దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణీదేవిని రంగంలోకి దింపారు సీఎం కేసీఆర్. వాణేదేవిని అభ్యర్థిగా ప్రకటించడంపైనా విమర్శలు వచ్చాయి. ఓడిపోయే సీటులో టికెట్ ఇచ్చి పీవీ కుటుంబాన్ని కేసీఆర్ అవమానించారని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపించాయి.
ఏమాత్రం అవకాశం లేదనే పరిస్థితుల్లో మండలి ఎన్నికల బరిలోకి దిగిన టీఆర్ఎస్.. రెండు సీట్లను గెలుచుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. దొంగ ఓట్లు.. నోట్ల కట్టలతోనే అధికార పార్టీ గెలిచిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనట్లుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటర్లకు డబ్బులు పంచి.. మండలి గౌరవాన్ని మంట కలిపిందని మండిపడుతున్నాయి. రెండు సీట్లలోనూ వంద కోట్ల రూపాయల వరకు అధికార పార్టీ ఖర్చు పెట్టిందని చెబుతున్నారు విపక్ష నేతలు.
దొంగ ఓట్లు టీఆర్ఎస్ గెలుపులో కీలకంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఓటర్ల ఎన్ రోల్ మెంట్ సమయంలోనే దొంగ ఓట్ల అంశం తెరపైకి వచ్చింది. అధికార పార్టీ నేతలు వేలాది బోగస్ ఓట్లను ఎన్ రోల్ చేయించారని తీన్మార్ మల్లన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అందుకు తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా అందించారు. అనురాగ్ విద్యాసంస్థలు, మల్లారెడ్డి కాలేజీల కేంద్రం బోగస్ ఓటర్ల ఎన్ రోల్ మెంట్ జరిగిందని చెప్పారు. దాదాపు 17 వేల ఓట్లకు సంబంధించిన వివరాలు తీన్మార్ మల్లన్న అందించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పట్టభద్రులతో ఎన్ రోల్ చేయించారని చెప్పారు. డిగ్రీ చేయని వారికి ఓట్లు వచ్చాయని తెలిపారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం స్పందించలేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో దొంగ ఓట్ల వల్లే టీఆర్ఎస్ గెలిచిందని స్పష్టమైందని తీన్మార్ మల్లన్న చెప్పారు. ‘వంద కోట్లు.. దొంగనోట్లు’ ఈ ప్రయత్నం ద్వారా ప్రజల గొంతుకను చట్టసభకు రాకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడ్డుకున్నారని ఆరోపించారు. బరాబర్ వస్తా.. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే రోజు తీసుకువస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు తీన్మార్ మల్లన్న. తానే అనేక అక్రమాలను బయటపెట్టానన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు సరైన గుణపాఠాన్ని ప్రభుత్వానికి తెలిపారన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని తీన్మార్ మల్లన్న అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు ఓట్లు కీలకం. అయితే పీఆర్సీ ఇవ్వలేదనే కోపంతో ఉన్న ఉద్యోగులు టీఆర్ఎస్ కు షాకిస్తారని భావించారు. అయితే ఉద్యోగుల మద్దతు కూడా అధికార పార్టీ లభించిందని ఫలితాల తర్వాత అంచనా వేస్తున్నారు. పీఆర్సీ ఇవ్వబోమని ఉద్యోగులను టీఆర్ఎస్ భయపెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పీఆర్సీ ఇవ్వరని భయపడే ఉద్యోగులు టిఆర్‌ఎస్ కు ఓటేశారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఉద్యమం వల్లే పీఆర్సీ పై కేసిఆర్ స్పందించారన్నారు. ఉద్యోగులకు మంచి చేస్తే కచ్చితంగా సహకరిస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని బండి సంజయ్ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని చెప్పారు.
హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. దొంగ ఓట్లు.. నోట్లు పంచడం వల్లే ఎక్కువ ఓట్లు సాధించిందన్నారు. పట్టభద్రులు కాని వారికి ఓట్లు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదన్నారు. మొత్తంగా దొంగ ఓట్లను భారీగా ఎన్ రోల్ చేయించి.. వారితో ఓట్లు వేయించుకోవడం ద్వారానే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచిందనే ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.